న్యూఢిల్లీ: వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అరెస్ట్ నుంచి 2 వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఆ లోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సజ్జల భార్గవరెడ్డిపై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదనుకున్నారా? ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఆ మాత్రం తెలుసుకోలేమా? సామాజిక మాధ్యమాల దుర్వినియోగం భరించరాని స్థాయికి వెళ్లింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ సులభంగా వస్తే ప్రతి ఒక్కరూ రెచ్చిపోతారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతం అని ధర్మాసనం పేర్కొంది. ఎవరు తప్పు చేసినా వ్యవస్థ చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేసింది.