- కరుణ, శాంతి, కర్మ అనే అంశాలపైనే అంతా ఆలోచించాలి
- భుజ్ భూకంప సమయంలో సాయి సేవలు నిరుపమానం
- సత్యసాయి శతజయంత్యుత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ
- బోధించారు… చదివించారు… సేవలందించారు:
- మానవ సేవే మాధవ సేవను బోధిస్తూ ఆచరించారు
- శతజయంత్యుత్సవాల్లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ
పుట్టపర్తి (చైతన్య రథం): సేవా పరమో ధర్మః అనేది మన మూల జీవన విధానంలోనే ఉందని… లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించారని… తాను ఆచరించడంతో పాటు సంస్థలూ అదే పాటించేలా శ్రీ సత్యసాయి అందరిలోనూ స్పూర్తి నింపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, శ్రీనివాస వర్మ, కిషన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ సహా పయ్యావుల, సవిత, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేశారు. సత్యసాయి స్మారక తపాళా బిళ్లల్ని ప్రధాని, సీఎం ఆవిష్కరించారు. మొదట శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొనడానికి పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు.
తర్వాత కుశ్వంత్ హాల్లో సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘‘సత్యసాయి మన మధ్య భౌతికంగా లేనప్పటికీ ఆయన స్థాపించిన సంస్థలు గ్రామీణాభివృద్ధి, ప్రజలకు వైద్యంలాంటి సేవల్ని అందిస్తున్నాయి. శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరుపుకోవటం మనకు వరం. బాబా పాటించిన ప్రేమ, సేవ భావన ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని ప్రభావితం చేస్తోంది. బాబా జీవితమే వసుదైక కుటుంబకం అనే భావనతో ఉండేది. మన భారతీయుల జీవన విధానమే సేవ, భక్తి, జ్ఞానం. కోట్లమంది బాబా భక్తులు దేశవ్యాప్తంగా మానవ సేవే మాధవ సేవ అని భావించి సేవలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి వైపరీత్యం వచ్చినా శ్రీసత్యసాయి సేవాదళ్ సభ్యులు ప్రజలకు సేవలందిస్తున్నారు. భుజ్ భూకంపం సమయంలో సేవాదళ్ చేసిన సేవలు నాకు బాగా గుర్తు. 3 వేల కిలోమీటర్లకు పైగా తాగునీటి పైపుల్ని ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తి తీర్చారు. వైద్యం ఉచితంగా అందిస్తున్న సంస్థలను బాబా నిర్మించారు. సుకన్య సమృద్ధి యోజన కోసం వేలమంది బాలికలకు ఆర్ధిక సాయం అందిస్తోంది ట్రస్టు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలున్నాయి. రూ.3.25 లక్షల కోట్లకు పైగా నిధులు ఈ ఖాతాల్లో ఉన్నాయి. వారణాసి ఎంపీగా అక్కడ 27 వేలమంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన కింద నిధులు జమ చేయించాను.
సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కోసం దేశంలో చాలా పథకాలను ప్రారంభించాం. వీటిపై విదేశాల్లో కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీసత్యసాయి ట్రస్టు తరపున వంద గిర్ జాతి గోవులను పేదవారికి నా చేతుల మీదుగా అందించటం సంతోషంగా ఉంది. పేద ప్రజల జీవితాల్లో ఈ గోవుల ద్వారా పెను మార్పు సంభవిస్తుంది. రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా వారణాసిలో 480కి పైగా గిర్ జాతి ఆవులను పేదవారికి అందించాం. ఇప్పుడు వెయ్యికిపైగా గిర్ ఆవులు ఆ ప్రాంతంలో తయారయ్యాయి. రువాండాలో 200కు పైగా గిర్ ఆవులన్నాయి. గోవుల దానంలాంటి సంప్రదాయం అక్కడ కూడా ఉంది. గోసంపద ద్వారా పాల ఉత్పత్తి, పౌష్టికాహారం, సోషల్ ఇమ్యూనిటీ లాంటివి పెరుగుతాయి. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు వెళ్తోంది. ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తే ఆత్మనిర్భర్ భారత్ తయారైనట్టే. శ్రీ భగవాన్ సత్యసాయి ప్రేరణతో అంతా కలిసి పనిచేద్దాం. ప్రతీ వ్యక్తి ఆలోచనలో కరుణ, శాంతి, కర్మ అనే విధానాల ద్వారా ముందుకు వెళ్లాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు.
సాయి సేవ.. విశ్వ సౌభాగ్యం: చంద్రబాబు
జయంత్యుత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి ఆయన ప్రతిరూపం. లవ్ ఆల్ సర్వ్ ఆల్.. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేది శ్రీసత్యసాయి మనకు చూపిన మార్గం. విశ్వశాంతి, విశ్వసౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో బాబా జీవించారు. భగవాన్ నడిచిన పుణ్యభూమిలో ఇవాళ ఆయన శతజయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి బాబా దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. ప్రేమ ఒక్కటే మతం, హృదయం ఒక్కటే భాష, మానవత్వమే కులం, అన్నిచోట్లా దైవం ఉన్నారని బాబా బోధించారు. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మికతవైపు నడిపించారు. వేర్వేరు దేశాలు వేర్వేరు ప్రాంతాల ప్రజలను మనో దర్శనంతో ప్రభావితం చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే ఆయన భావనతో శ్రీసత్యసాయి భక్తులు మానవాళికి సేవలు అందిస్తున్నారు. భక్తుల్ని ఎంతో ప్రేమగా ‘బంగారూ’… అంటూ ఆయన పిలిచే పిలుపు ఎప్పటికీ గుర్తుంటుంది.
బాబాతో నాకు ఎన్నో అనుభవాలున్నాయి. ట్రస్ట్ కార్యక్రమాలపై పలుమార్లు నాతో చర్చించారు. విలువలతో కూడిన విద్యను 1నుంచి ఉన్నత విద్య వరకూ ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు… 60,000 మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ, జనరల్ ఆస్పత్రులు, మొబైల్ ఆస్పత్రుల ద్వారా రోజూ రోగులకు సేవలందుతున్నాయి. రాయలసీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రశాంతి నిలయాన్ని తాకట్టుపెట్టి అయినా ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నారు. ఈ విషయం తెలిసి భక్తులు ముందుకు వచ్చి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. రూ.550 కోట్లు ఖర్చుపెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు, 30 లక్షలకు పైగా జనాభాకు నీరిచ్చారు. చెన్నై డ్రిరకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీంకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం భగవాన్ శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది’’ అని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు














