- వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు
అమరావతి (చైతన్య రథం): ఏపీలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ముగించుకున్న అనంతరం, ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సుమారు రెండు గంటలపాటు ఇద్దరిమధ్య సుదీర్ఘ భేటీ సాగింది. ‘
జల్ జీవన్ మిషన్’ పురోగతిపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. గత ప్రభుత్వం కేంద్రం అందించే ‘జల్ జీవన్ మిషన్’ నిధులను దారిమళ్లించి, పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని అభిప్రాయపడ్డారు. నిలిచిపోయిన తాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పునరుద్ధరించి, పనులను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రోజుకు 55 లీటర్ల తలసరి నీటిని కూటమి ప్రభుత్వం అందజేయనుంది. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి ప్రస్తుతం నెలకొన్న వివాదాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, నియోజకవర్గాలవారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ పనుల గురించి సీఎంకు డిప్యూటీ సీఎం వివరించారు. అన్ని పంచాయతీల్లో ఈ తరహాడ్రెయిన్లు నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా అమలు చేయాలని ఇరువురు చర్చించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని డ్రైనేజీల్లో పూడికతీత అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేసవిలోనే పూడిక తీత పనులు చేపట్టి.. రైతులు పంటలు వేసేలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అటవీశాఖ చేపట్టిన ‘హనుమాన్ ప్రాజెక్ట్’ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు.














