- నేటితరానికి మీనాటితరం ఎప్పుడూ స్ఫూర్తి
- 80ఏళ్ల రామసుబ్బమ్మ విజయగాథపై లోకేష్ స్పందన
అమరావతి (చైతన్య రథం): టీనేజ్ పిల్లలతో పరుగుపందెంలో పోటీపడిన ఓల్డేజ్ గ్రాండ్ మాకు శిరసువంచి నమస్కారం. నేటితరానికి మీనాటితరం ఎప్పుడూ స్ఫూర్తి” అంటూ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగంతో ప్రకటించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80ఏళ్ల రామసుబ్బమ్మ విజయగాథపై ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. “ఐ యామ్ ఫస్ట్.. 32 గోల్డ్.. 14 సిల్వర్ అంటూ విజయగర్వంతో ప్రకటిస్తోన్న నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80 ఏళ్ల రామసుబ్బమ్మ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన బీబీసీ తెలుగుకు అభినందనలు. పరీక్ష ఫెయిలయ్యామని, టాప్ ర్యాంక్ రాలేదని, క్రీడల్లో పతకాలు సాధించలేకపోయామని నిరుత్సాహపడే నేటితరం.. బామ్మగారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె క్రీడాస్ఫూర్తి, లక్ష్యసాధనకు చేసిన కఠోర శ్రమకు శిరసువంచి నమస్కరిస్తున్నాను.
చిన్నపిల్ల వయసులో ఆటలు ఆడేది, పేదరికం అడ్డంకిగా మారింది. పెళ్లయ్యింది. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో పరుగు ఆగిపోయింది. ఇళ్లల్లో పనిచేసి కుటుంబాన్ని పోషించింది. చదువు విలువ తెలిసిన తల్లి చొరవతో పిల్లలు సెటిలయ్యారు. తన కలను సాకారం చేసుకునేందుకు అడుగులు వేసింది. చిన్నప్పుడు ఆగిపోయిన పరుగును వృద్ధురాలయ్యాక ఆరంభించింది. మనస్సులోని సంకల్పానికి 80ఏళ్ల వయస్సు అడ్డుకాలేదు. బాలికలతోనూ పరుగుపందెంలో పాల్గొని పతకాలు సాధిస్తోంది. యంగ్ అండ్ డైనమిక్ అథ్లెట్ రామసుబ్బమ్మకు హృదయపూర్వక అభినందనలు. జాతీయ పరుగు పందెంలో పోటీపడాలనుకుంటున్న బామ్మగారికి మనవడు లోకేష్ అండగా నిలుస్తాడు. ఏం సాయం కావాలన్నా అందిస్తాడు. రన్ గ్రాండ్ మా.. రన్..!!” అంటూ మంత్రి లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు.
















