- అక్టోబర్ 2నాటికి చెత్తరహిత మున్సిపాలిటీలు
- ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీ ఓ విషవృక్షం
- వైసీపీ భూస్థాపితంతోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్
- మునిగింది అమరావతి కాదు… అవినీతి వైసీపీ
- అపోహలొద్దు, అర్హులందరికీ దివ్యాంగ పింఛన్లు
- స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు స్పష్టం
పెద్దాపురం (చైతన్య రథం): ప్రజారోగ్య రక్షణకు తమ ఆరోగ్యాలు ఫణం పెడుతున్న మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కొత్త వేతన అకౌంట్ల ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న 55,686 మంది కార్మికులకు అదనపు ప్రయోజనం చేకూరుస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన రెగ్యులర్ కార్మికులకు రూ.1 కోటి, ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు రూ.20 లక్షల చొప్పున కుటుంబాలకు బీమా సొమ్ము అందజేస్తామన్నారు. శాశ్వత వైకల్యం పొందినా ఇంతే మొత్తాన్ని అందిస్తామని ప్రకటించారు. అదేవిధంగా వారి పిల్లలకు రూ.8 లక్షల వరకు విద్యాసాయం అందిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సంరద్భంగా నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో వైద్య విద్యార్థులు, స్థానికులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రజావేదిక నుంచి మాట్లాడారు.
పరిసరాల శుభ్రత… అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా చంద్రబాబు స్పష్టం చేశారు. ‘గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందే కానీ చెత్తను తొలగించలేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తతో రాష్ట్రాన్ని చెత్తమయం చేశారు. అక్టోబర్ 2నాటికి అన్ని మున్సిపాలిటీల్లో నూటికి నూరుశాతం చెత్తను తొలగిస్తాం. గ్రామాలు, పట్టణాలే కాదు.. మన ఆలోచనలూ స్వచ్ఛంగా ఉండాలి. మంచి మనసున్న వ్యక్తులుండే తూర్పుగోదావరి జిల్లాలో కూడా గడిచిన ఐదేళ్లలో రౌడీయిజం సాగించారు. చెత్తనుంచి సంపద సృష్టించే ఆలోచన చేస్తున్నాం. చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయడం, ప్లాస్టిక్ నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి పెట్టా’మని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
పెట్టుబడులు తెస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు
వైసీపీ విష ప్రచారాలు, ఫేక్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే సిద్దాంతంగా వైసీపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్లలో జరిగిన విష ప్రచారాలను, వైసీపీ కుట్రలను ప్రజలకు వివరించారు. ‘మేము ప్రజల కోసం మంచి పనులు చేస్తుంటే వైసీపీ విషం చిమ్ముతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి మాపై విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధితో ముందుకెళ్తున్నాం. ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ… ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రయాణం చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తుంటే రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకి సృష్టిస్తున్నారు’ అంటూ వైసీపీపై ధ్వజమెత్తారు.
మనది విజన్… వైసీపీది క్రిమినలిజం
మనది విజన్ రాజకీయం. వైసీపీది క్రిమినల్ రాజకీయం అంటూ జగన్ పార్టీ తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా ఎండగట్టారు. ‘వైసీపీ చేసేవన్నీ నీచ రాజకీయాలే. మనది అభివృద్ది రాజకీయం. వైసీపీది రాష్ట్రానికి అనర్థం రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం… వాళ్లది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయమైతే.. వైసీపీది క్రిమినల్ రాజకీయం. తప్పుడు పోస్టు సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని తీసుకుని సాక్షి, ఇతర బ్లూమీడియా ప్రచారం చేయడమే వైసీపీ రాజకీయం. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి రాజకీయ పార్టీలు మనకు అవసరం లేదు. నా రాజకీయ జీవితంలో వైసీపీలాంటి రాజకీయ పార్టీని చూడలేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా సొంత టీవీ ఛానల్, పేపర్ ఉన్నాయా..? తప్పుడు వార్తలు వేయడానికి పేపర్, టీవీ పెట్టుకున్నారు. నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. మహిళలపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాకపోవడంతో బయట తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ విషవృక్షంలాంటి పార్టీ. నేరాలు, ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించలేరని వారు గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు రాష్ట్రంలో నక్సలిజంపై పోరాడాం. సీమలో ఫ్యాక్షన్ మాట వినపడకుండా చేశాం. నా దగ్గర వారి ఆటలు సాగనివ్వను’ అని సీఎం చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
దోమలపై దండయాత్ర అంటే ఎగతాళి చేశారు
వర్షాలకు సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని.. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయని సీఎం చెప్పారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా ముప్పు తలెత్తుతోందన్నారు. ‘లక్షల రూపాయిలు వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తోంది. నేను 2014-19లో దోమలపై యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. కానీ గత ప్రభుత్వం ప్రజారోగ్యంపై తీవ్ర నిర్లక్ష్యం వహించింది. కనీసం బ్లీచింగ్ కూడా చల్లలేదు. అప్పులుచేసి సంక్షేమం ఇస్తే దీర్ఘకాల ప్రయోజనాలు ఉండవు. సంపద సృష్టితోనే సంక్షేమం సాధ్యమవుతుంది. సాధ్యమా? అనుకున్న సూపర్ సిక్స్ హామీలు సాధ్యం చేసి చూపించాం. అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్నాం. బీజేపీ, జనసేనతో కలిసి ఓవైపు రాష్ట్ర పునర్నిర్మాణం, మరోవైపు అభివృద్ధి, సంక్షేమ పథంలో నడిపిస్తున్నాం. ఆగస్టు 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశాం. ప్రతి నెలా 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఆగస్టు 2న అన్నదాత సుఖీభవకు శ్రీకారం చుట్టి మొదటవిడతగా రూ.7,000 ఖాతాల్లో వేశాం. ఈనెల 7న నేతన్నలకు అండగా నిలిచేలా… మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. త్వరలో నేతన్న భరోసా పేరుతో ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని ప్రకటించాం. నాయీ బ్రాహ్మణలకు లబ్ది చేకూరేలా… సెలూన్లకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రారంభించాం’ అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
స్త్రీ శక్తి సూపర్ హిట్
ఆగస్టు 15న స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, ఉచిత బస్సు అంటే కొందరు ఎగతాళి చేశారని ముఖ్యమంత్రి అన్నారు. అయినప్పటికీ ఆచరణలో చేసి చూపించామని తెలిపారు. ‘ఇప్పటివరకూ కోటిమంది మహిళలు ఉచిత బస్సు ద్వారా ప్రయాణం చేశారు. 19న నాకెంతో ఇష్టమైన పీ`4ను క్షేత్రస్థాయిలో అమలును ప్రారంభించాం. 21న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించాం. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. రాష్ట్రంలో పేదరికం అనే మాట వినపడకూడదని పని చేస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రి
పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప తన నియోజకవర్గం కోసం ఏదడిగా కాదనకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే అడిగిన దానికంటే ఎక్కువే చేస్తానన్నారు. ‘పెద్దాపురం, సామర్లకోటలో ఇంటింటికీ కుళాయి కోసం రూ.75 కోట్లు వ్యయమవుతుందని చెప్పారు. అమృత పథకం కింద నిధులు మంజూరు చేసి రెండేళ్లలో పూర్తి చేస్తాం. పెద్దాపురంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణంతోపాటు డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తాం. పెద్దాపురంలో 15 మెగావాట్ల సామర్థ్యంతో రూ.330 కోట్లతో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. దీన్ని 18 నెలల్లో పూర్తి చేస్తాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, కాకినాడ ఎంపీ ఉదయ్, స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప సహా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, మున్సిపల్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.