- తల్లి కోగంటి ఇందిరాదేవి పేరిట విరాళం
- సీఎంకు చెక్ అందించిన విజయలక్ష్మి
అమరావతి (చైతన్య రథం): కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1 కోటి రూపాయలు విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి చెక్కు అందించారు. ప్రస్తుతం హైదారాబాద్ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో రూ.1 కోటి విరాళంగా ఇచ్చామన్నారు. తమ తల్లి ఇందిరాదేవికి పేరిట ఆవిడ కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో తమకున్న స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్టు విజయలక్ష్మి ప్రకటించారు. పి విజయలక్ష్మి త్యాగనిరతిని, స్ఫూర్తిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. స్థలం అమ్మి తల్లిపేరిట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కోగంటి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా ఉన్నారు. గతంలో విజయనగరంలో గోశాలకు విజయలక్ష్మి, ఇందిరాదేవి విరాళాలు ఇచ్చారు. విజయలక్ష్మి రూ.1 కోటి విరాళం చెక్కును తమ బంధువైన కె రవీంద్రకుమార్‌తో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు.