- క్షేత్రస్థాయి పనితీరుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం
- సమర్థ సేవలందించేలా తీర్చిదిద్దాలని కసరత్తు
- తొలి సమావేశంలో వివరాలు సేకరించిన సీఎం
అమరావతి (చైతన్య రథం): ఐదేళ్ల జగన్ పాలనలో భ్రష్టుపట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. వ్యవస్థను అర్థవంతంగా తీర్చిదిద్దడమే కాదు, బలోపేతం చేసి ప్రజలకు ఉపయుక్తంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం జీఎస్డబ్ల్యూఎస్పై తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అటు గ్రామాల్లోనూ, ఇటు పట్టణ, నగర ప్రాంతాల్లోనూ సచివాలయాలు ప్రజలకు మరింత చేరువై, ఏవిధంగా మెరుగైన సేవలు అందించాలనే దానిపైన ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. సచివాలయ వ్యవస్ధ పునర్వ్యవస్థీకరణ ప్రధాన అజెండాగా జరిగిన తొలి సమావేశంలో వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా అత్యుత్తమ ప్రజాసేవలు అందించడంతోపాటు సచివాలయ ఉద్యోగులకు కూడా ఒక క్రమబద్ధమైన ఉద్యోగ బాధ్యతలు కల్పించి వ్యవస్ధను సమర్థంగా ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు.. ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపైనా చర్చించారు. సచివాలయ ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని.. అందరికీ సమాన పని బాధ్యత ఉండేలా చూడాలనే ఆలోచనపై అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, శిక్షణ ఇవ్వాలని సమావేశంలో చర్చించారు.
పంచాయతీలు ఎక్కువ `సచివాలయాలు తక్కువ
ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 13,291 ఉండగా, గ్రామ సచివాలయాలు 11,162 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా వీటిలో 1,19,803 మంది ఉద్యోగులను నేరుగా నియమించారు. ఇతర విభాగాల వారిని కూడా కలుపుకుంటే 1,27,175 మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో గ్రామ సచివాలయాల్లో 95,533 మంది, వార్డు సచివాలయాల్లో 31,592 మంది ఉన్నారు. వీరిలో 18నుంచి 27 ఏళ్ల వయసున్న ఉద్యోగులు 50,284 (39.54శాతం) మంది, 28నుంచి 37ఏళ్ల వయసున్న ఉద్యోగులు 54,774 (43.07శాతం) మంది ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో పీజీ, పీహెచ్డీ, ఇంజినీరింగ్, వైద్య విద్య చదివిన వాళ్లున్నారు. పీజీ, ఆపైన చదివిన ఉద్యోగులు 14శాతం, వృత్తివిద్యా కోర్సులు చదివిన వాళ్లు 31శాతం ఉన్నారు. యువత అధికంగా ఉండే ఈ వ్యవస్ధను ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. మొదటి సమావేశంలో వ్యవస్ధ పనితీరుతో పాటు పలు అంశాలపై చర్చించారు. రానున్న రోజుల్లో మరింత కసరత్తు జరిపి ప్రభుత్వం ఈ విభాగంపై ముందడుగు వేయనుంది.