- చంద్రబాబు నేతృత్వంలో ట్రెండ్ సెట్ చేస్తోన్న ఏపీ
- కలలు కనడమేకాదు… భారీ పెట్టబడులతో వాటిని సాకారం చేస్తున్నాం
- 8నెలల వ్యవధిలోనే క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించాం
- క్లీనర్, గ్రీనర్, గ్రేటర్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యసాధనే మా విజన్
- మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన
- రూ.22వేల కోట్ల రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌కు లోకేష్ శంకుస్థాపన
- త్వరలోనే రాయలసీమకు హైకోర్టు బెంచి వస్తుందని హామీ
అనంతపురం (చైతన్యరథం): రెన్యూపవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మేం వేస్తున్న పునాదిరాయి… భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికే పునాదిరాయి లాంటిదని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న రూ.22వేల కోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… రెన్యూ పవర్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సముదాయ ప్రారంభోత్సవం… సాహసోపేతమైన నిర్ణయానికి, స్థిరమైన ప్రగతికి చిహ్నంగా పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రూ.22వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ గ్రిడ్‌లకు శక్తినివ్వడమే కాకుండా… నిరుద్యోగ యువత ఆశలకు ఊపిరి పోస్తుంది, రేపటి వెలుగుకు దారి చూపుతుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు- ఇది ఒక ఉద్యమం. ఈ సందర్భం.. మన కలలకు, భవిష్యత్ తరాలకు వారధి లాంటిది. భూమిపై సూర్యకాంతి, స్వచ్ఛమైన, అమూల్యమైన గాలి లభిస్తున్నపుడు భావితరం కోసం మరోగ్రహం కోసం ఎందుకు ఆలోచించాలి? శిలాజ ఇంధనాల కాలం నుండి.. భవిష్యత్ తరం ఇంధనాల వినియోగం కోసం మేం ముందడుగు వేస్తున్నాం. భావితరాల కోసం ఒక ఉన్నత లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ హరిత విప్లవానికి బ్లూ ప్రింట్
ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రతి మెగావాట్ విద్యుత్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది, భారతదేశాన్ని ముందుండి నడిపించే శక్తిరథానికి ఆంధ్రప్రదేశ్ సారథ్యం వహిస్తుంది. భారతదేశంలో గ్రీన్ పవర్ హౌస్‌గా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన రెన్యూ చైర్మన్, సిఇఓ సుమంత్ సిన్హా, సంస్థ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. రెన్యూ పవర్ ఇక్కడ ఏర్పాటు చేసే భారీ ప్రాజెక్టు మా పాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబించడమేగాక భవిష్యత్‌పై నమ్మకానికి వెలుగురేఖగా నిలుస్తుంది. ఆరేళ్ల తర్వాత రెన్యూ గతంకంటే మెరుగ్గా ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చింది. ఈ విప్లవాత్మక మార్పు వెనుక ఒక దార్శనికుడు ఉన్నాడు. ఆయన రేపటి గురించే కాకుండా రాబోయే దశాబ్దాల గురించి కూడా ముందుగా ఆలోచిస్తాడు. విజనరీ లీడర్ చంద్రబాబు కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాలను మాత్రమే నిర్మించడం లేదు, రేపటితరం భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తున్నారు. ఇతరులు పాలసీలు చూసిన చోట ఆయన అవకాశాలను చూశారు. ఆ దార్శనికుడి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ట్రెండ్‌ను ఫాలో కావడం లేదు, ట్రెండ్ సెట్ చేస్తోంది. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో 2024, అక్టోబర్‌లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐసీఈ) పాలసీ భారతదేశ హరిత విప్లవానికి బ్లూప్రింట్‌గా మారిందని మంత్రి లోకేష్ అన్నారు.
రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో దూసుకు పోతున్నాం
చంద్రబాబునాయుడు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అయిదేళ్ల విరామం తర్వాత సమర్థవంతమైన పనితీరుకు ప్రతీకగా రూపాంతరం చెందుతోంది. భారతదేశ పునరుత్పాదక పటంలో తిరిగి చేరడం కాదు, రెన్యూవబుల్ ఎనర్జీలో సరికొత్త మ్యాప్‌లను రూపొందిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు సంబంధించి 2024లో మేం ఒక ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలన్న మా సాహసోపేతమైన లక్ష్యం అత్యవసరమైంది. మేం కలలు కనడమేగాక వాటిని సాకారం చేస్తున్నాం. కేవలం 8నెలల వ్యవధిలో క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించగలిగాం. టాటా పవర్ (7,000 వీఔ) : రూ.49,000 కోట్లు, ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్: రూ.1.86 లక్షల కోట్లు, వేదాంత సెరెంటికా (10,000 వీఔ): రూ.50,000 కోట్లు, ఎస్‌ఏఈఎల్ ఇండస్ట్రీస్ (1,200 వీఔ) : రూ. 6,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ (8,000 వీఔ): రూ. 50,000 కోట్లు…ఇవి కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు, రాష్ట్రంపై విశ్వాసానికి అవి సంస్థల ఆమోద ముద్రలు. ఆంధ్రప్రదేశ్‌పై ఆయా కంపెనీల నమ్మకంతోపాటు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధనకు ఏపీ సిద్ధంగా ఉందనడానికి ఇది నిదర్శనం. అనంతపురం రెన్యూ పునరుత్పాదక ఇంధన కాంప్లెక్స్ రెండు దశల్లో నిర్మితమవుతుంది. తొలిదశలో రెన్యూ సంస్థ 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై మొత్తంగా 22 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సముదాయం పెద్దఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తుందని మంత్రి లోకేష్ వివరించారు.
5ఏళ్ల తర్వాత ఏపీలో గ్రీన్ ఎనర్జీ పునరుజ్జీవనం
ఐదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ పునరుజ్జీవనానికి రెన్యూ ప్రత్యక్షసాక్షిగా నిలుస్తోంది. రెన్యూ వంటి ప్రధాన పునురుత్పాదక ఇంధన సంస్థల తిరిగి రాక ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ దశాబ్దం, ఇది క్లీన్ ఎనర్జీ అరుణోదయ రాష్ట్రం. 2019కి ముందు రెన్యూ పవర్ ఏపీలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల్లో ఒకటి అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ వారు తిరిగి రావడానికి కారణం మనపై నమ్మకం. పాలసీలు బలంగా ఉంటే విశ్వాసం తిరిగి వస్తుంది. దార్శనిక నాయకత్వం ఉంటే అనివార్య వృద్ధి సాధ్యమవుతుంది. రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా మన రాష్ట్రంపైన, భవిష్యత్తుపైన ఉంచిన నమ్మకం స్ఫూర్తిదాయకం. మీ రాక కేవలం భాగస్వామ్యం మాత్రమే కాదు, ఇది దార్శనికత, విలువల కలయిక. ఈ కార్యక్రమానికి కార్యరూపమిచ్చిన ప్రభుత్వ అధికారులు, భాగస్వాములందరికీ ధన్యవాదాలు. మేము కాంక్రీటు వేయడం మాత్రమే కాదు, ఒక విజన్‌ను రూపొందిస్తున్నాం. క్లీనర్, గ్రీనర్, గ్రేటర్ ఆంధ్రప్రదేశ్ మా విజన్. నా క్యాబినెట్ సహచరులు, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ, సంబంధిత జిల్లా అధికారులందరూ ఈ ప్రాజెక్టులు సకాలంలో ప్రారంభించేలా అవసరమైన అన్ని సహాయ, సహకారాలను అందించాలని నేను అభ్యర్థిస్తున్నాను. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సమయంలో పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు మనల్ని పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామి రాష్ట్రంగా, క్లీన్ ఎనర్జీకి హబ్‌గా నిలబెట్టడానికి దోహదపడుతుంది. కలసికట్టుగా ఎదుగుతూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిద్దాం. కాలుష్య వారసత్వాన్ని వదిలేసి భవిష్యత్ తరాలకు క్లీన్ ఎనర్జీని అందిద్దామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.
త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచి తెస్తాం
త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచి తీసుకువస్తాం. దాని ప్రారంభానికి ప్రధాని మోదీని రాయలసీమకు ఆహ్వానిస్తాం. ప్రధాని ఎంతో పనివత్తిడిలో ఉన్నప్పటికీ ఇటీవల అమరావతి పనుల పునఃప్రారంభానికి రాష్ట్రానికి వచ్చారు. ఏపీ ప్రజల అన్ని కోర్కెలను ప్రధాని మోదీ తీరుస్తున్నారు. దేశంలో రాబోయే అయిదేళ్లలో 500 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సాధించాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. 2014 రాష్ట్రవిభజన తర్వాత మనల్ని కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి గెంటేశారు, అప్పుడు చంద్రబాబు రాష్ట్రప్రజలందరినీ ఒప్పించి అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఆనాడే అనంతపురానికి కియా, జాకీ వంటి పరిశ్రమలను తెచ్చారు, కర్నూలుకు పెద్దఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తెచ్చాం. ఒక్క అవకాశం మాయలోపడి జగన్‌కు అధికారం ఇచ్చినందుకు రాష్ట్రం దారితప్పింది. ముఖ్యంగా గత అయిదేళ్లలో ఏపీ యువత తీవ్రంగా నష్టపోయారు. అయిదేళ్లలో కనీసం రాష్ట్రంలో గుంతలు కూడా పూడ్చలేదు. మేము దావోస్ వెళ్లినపుడు రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుచేసేందుకు సుమంత్ సిన్హా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టిసిఎస్, టాటా ఎనర్జీ సంస్థలను నెలకొల్పేందుకు టాటా చైర్మన్ చంద్రశేఖరన్ అంగీకరించారని మంత్రి లోకేష్ తెలిపారు.
బడా పరిశ్రమల రాకకు చంద్రబాబు బ్రాండే కారణం
నేను ఢల్లీి వెళితే అక్కడ మీడియా ప్రతినిధులు మీ పొరుగు రాష్ట్రాలకు హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరు ఉన్నాయి, మీకు ఏమి ఉందని నన్ను అడిగారు. మాకు చంద్రబాబు బ్రాండ్ ఉందని చెప్పాను. ఆ బ్రాండ్ వల్లే నేడు రెన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా ఇంతదూరం వచ్చారు. టిసిఎస్ వంటి ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఆ బ్రాండే కారణం. రాష్ట్రంలో యువతకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యసాధనలో భాగంగానే రెన్యూ ప్రాజెక్టును తెచ్చాం. దీనిద్వారా 10వేలమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మెగా డిఎస్సీ ద్వారా వచ్చే నెలలోనే 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీచేస్తాం. రెన్యూ వంటి పెద్ద పరిశ్రమలను స్థానిక ప్రజలు ఆహ్వానించాలి. ఇటువంటి సంస్థల వల్ల మన బిడ్డలకు ఉద్యోగాలు లభిస్తాయి. రాబోయే అయిదేళ్లలో 78 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సాధించాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగా పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలతో ఇక్కడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నెలకొల్పి, స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటాం. గత అయిదేళ్లలో ఒక్క మెగావాట్ అదనపు విద్యుత్ కూడా రాష్ట్రంలో తయారుకాలేదు. విద్యుత్ చార్జీలు తగ్గించాలనే లక్ష్యంతో రెన్యూ వంటి సంస్థలను రాష్ట్రానికి రప్పిస్తున్నాం. ఇక్కడ తయారయ్యే విద్యుత్ కేవలం మన రాష్ట్రానికేగాక యావత్ దేశానికి అందుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
పారిపోయిన పరిశ్రమలన్నీ తిరిగి వస్తున్నాయ్: మంత్రి గొట్టిపాటి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… మంత్రి నారా లోకేష్ దావోస్‌లో రెన్యూ చైర్మన్‌తో చర్చలు జరిపి ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ ఇక్కడకు వచ్చేలా చేశారన్నారు. దీనిద్వారా స్థానిక యువత, రైతులకు మేలు జరుగుతుంది. జగన్ పాలనలో ఒక్క మెగావాట్ అదనపు విద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి కాలేదు. ఇందుకు ఆయన సిగ్గుపడాలి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగానికి మళ్లీ గత వైభవం వచ్చింది. దేశంలో 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సాధించాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమైతే, అందులో 100 గిగావాట్లు ఏపీలోనే సాధించాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పం. టాటా పవర్ సంస్థ త్వరలో 7వేల మెగావాట్ల సామర్థ్యంతో రూ.50వేలకోట్ల విలువైన రెన్యువబుల్ ఎనర్జీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతోంది. గత ప్రభుత్వంలో పారిపోయిన కంపెనీలన్నీ మళ్లీ ప్రజాప్రభుత్వంలో తిరిగివస్తున్నాయి. 11నెలల కూటమి పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. దేశంలో ఎక్కడా లేనంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నాం. యువగళంలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల సాధనకు ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ, ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇటీవల రిలయన్స్ సంస్థ 65వేల కోట్ల విలువైన సిబిజి ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ రెన్యూ సంస్థ ఏర్పాటుచేసే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ వల్ల రైతులు, యువతకు మేలు జరుగుతుంది. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తిచేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని రెన్యూ సంస్థకు మంత్రి రవికుమార్ విజ్ఞప్తిచేశారు.
మోదీ, చంద్రబాబు ఆశయ సాధనలో భాగస్వాములం అవుతాం: సుమంత్ సిన్హా
రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ… రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కొత్త శకానికి నాంది పలికామన్నారు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, ప్రగతిశీల పాలన, దృఢమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకు వెళ్తోంది. ఏపీ అద్భుతమైన ట్రాన్స్ మిషన్ కనెక్టివిటీ, సౌర, పవన వనరులను సమృద్ధిగా కలిగి ఉంది. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి సీఎం చంద్రబాబు విజన్ తోడైంది. మౌలిక సదుపాయాల కల్పన, సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిస్తున్నారు. 2030 నాటికి 500 Gఔ శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆశయ సాధనలో భాగస్వాములు కావడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ముందుకు వచ్చాం. ఏపీలో సింగిల్ విండో అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతున్నాయి. ఇక్కడ రూ.22వేల కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ భారతదేశంలోనే అతిపెద్దది. ఈ ప్రాజెక్టు ద్వారా 10వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఏపీలోని 10 సైట్‌లలో రెన్యూ సంస్థ 717 వీఔ ఆపరేషనల్ విండ్ కెపాసిటీ, 60 వీఔ సోలార్ కెపాసిటీ పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారిత ఇంధనాన్ని అభివృద్ధి చేయడానికి మా కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 78.5 Gఔ సౌర, 35 Gఔ పవన విద్యుత్, 25 Gఔష్ట్ర బ్యాటరీ శక్తి నిల్వ సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తాం. మేం ఏర్పాటుచేసే ప్రాజెక్టు ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్టు తమదిగా భావించి స్థానిక రైతాంగం సహకరించాలి. మేం స్థాపించే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ వల్ల యావత్ ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని సుమంత్ సిన్హా అన్నారు.
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ… రెన్యూ సంస్థ బేతపల్లికి రావడం ఈ ప్రాంత రైతుల అదృష్టం అన్నారు. ఎకరాకు రూ.35వేల వరకు కౌలు రూపంలో రైతులకు రావడమేగాక వారి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని రెన్యూ సంస్థను చంద్రబాబు, లోకేష్ ఇక్కడకు రప్పించారు. ప్రస్తుతం 2వేల ఎకరాల్లో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారు, దీనిని 5వేల ఎకరాల వరకు విస్తరించే అవకాశం ఉంది. రైతులు, స్థానిక యువత ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసేందుకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెన్యూ సంస్థ సిఇఓ బలరాం మెహతా తదితరులు పాల్గొన్నారు.