- నేడు కనిగిరిలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శ్రీకారం
- 5ఏళ్లలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు, 2.5లక్షల మందికి ఉపాధి
- మంత్రి లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం
- 500 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న రిలయన్స్
- వినియోగంలోకి బంజరు భూములు
అమరావతి (చైతన్యరథం): భారత్‌లో 2035 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా సాంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోంది. ఈ లక్ష్యసాధన కోసం విజనరీ లీడర్ చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో రిలయన్స్ సంస్థ రూ.65వేల కోట్లతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రిలయన్స్ తొలి సీబీజీ ప్లాంట్‌కు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 2వ తేదీన మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తోపాటు ఇతర మంత్రులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, ఆర్‌ఐఎల్ మెంటార్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ బిజినెస్ సీఈఓ హరీంద్ర కెే త్రిపాటి పాల్గొంటారు. బయో ఇంధన రంగంలో ఇదొక మైలురాయిగా నిలవనుంది. రాబోయే 5 ఏళ్లలో రిలయన్స్ ఏర్పాటుచేసే 500 సీబీజీ ప్లాంట్లకు అనుబంధంగా ఎనర్జీ ప్లాంటేషన్ ద్వారా 5లక్షల ఎకరాల బంజరుభూమి ఉపయోగంలోకి వస్తుంది. రాష్ట్రంలో 2.5లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అన్ని ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభిస్తే ప్రతి ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయ అవశేషాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాలు, ఇంధన పంటల ఆధారంగా రిలయన్స్ సంస్థ పాన్ ఇండియా సీబీజీ ప్లాంట్లను నిరర్థక భూముల్లో ఏర్పాటు చేస్తోంది.
బంజరు భూముల్లో..
రిలయన్స్ సంస్థ దేశవ్యాప్తంగా 4 ఇంటిగ్రేటెడ్ సీబీజీ హబ్‌లను విభిన్న బంజరుభూముల్లో ఏర్పాటుచేస్తుండగా, అందులో ప్రకాశం జిల్లాలో ఒక హబ్ ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, అనంతపూర్, చిత్తూరు, కడప జిల్లాల్లో అధికంగా బంజరుభూములు ఉన్న ప్లాంతాల్లో సీబీజీ ప్లాంట్లను ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలోని నిరర్థక భూముల్లో కేవలం 3నుంచి 4శాతం భూమిలో ఎనర్జీ క్రాప్స్ ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో రిలయన్స్ 500 ఇంటిగ్రేటేడ్ సీబీజీ ప్లాంట్లను ఏర్పాటుచేస్తోంది. సీబీజీ ప్లాంట్, క్యాప్టివ్ ఎనర్జీ ప్లాంటేషన్ కోసం ప్రతిప్లాంటుకు వెయ్యి ఎకరాల బంజరుభూమి అవసరమవుతుంది. ఒక సీబీజీ ప్లాంటు నెలకొల్పడానికి రిలయన్స్ బయో ఎనర్జీ సంస్థ రూ.130 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇందులో ప్లాంటు ఏర్పాటుకు రూ.105 కోట్లు, సమీప బంజరుభూముల పునరుజ్జీవనానికి రూ.25కోట్లు వెచ్చిస్తుంది. ప్రతి సీబీజీ ప్లాంటు ఏటా 7,800 మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ తో పాటు 22వేల మెట్రిక్ టన్నుల హైక్వాలిటీ ఫెర్మినేటెడ్ మాన్యూర్‌ను ఉత్పత్తిచేస్తుంది. దీనిద్వారా 3వేల ఎకరాల భూమిని సారవంతంగా మార్చవచ్చు.
సారవంతంగా నిరర్థక భూములు
రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న 5.5 లక్షల బంజరుభూముల్లో హైబ్రిడ్ నేపియర్ గ్రాస్, ఇతర ఎనర్జీ పంటలను పెంచడం ద్వారా ఇంటిగ్రేటెడ్ సీబీజీ ప్లాంట్లను నెలకొల్పాలని రిలయన్స్ సంస్థ నిర్ణయించింది. సీబీజీ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఫెర్టిలైజర్‌ను ఉపయోగించి నిరర్థక భూములను ఉత్పాదక భూములుగా మారుస్తారు. దీనిద్వారా ప్లాంట్లు నెలకొల్పే ప్రాంతాల్లో యువతకు ఉపాధి లభిస్తుంది. రిలయన్స్ సీబీజీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి. సీబీజీ ప్లాంట్‌లకు సమీపంలో ఉత్పత్తి అయ్యే సేంద్రియ ఎరువుతో సమీప ప్రాంత నిరర్థక భూములను సారవంతంగా మార్చడానికి ఆస్కారమేర్పడుతుంది. భారత్‌లో 13 కేటగిరిలకు చెందిన 160 మిలియన్ ఎకరాల బంజరుభూమి ఉండగా, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రతిఏటా నిరర్థక భూమి విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. దేశంలోని మొత్తం బంజరు భూమిలో 50శాతం భూమి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఉంది. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా పెద్దఎత్తున పారిశ్రామికీకరణ జరిగి జీడీపీ వృద్ధి చెందుతుంది. అన్ని సీబీజీ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైతే రోజుకు 9.75 లక్షల ఎల్‌సీవీలను నింపుతుంది. ఇది మొత్తం ఇంధన అవసరాల్లో 5శాతాన్ని భర్తీ చేస్తుంది. సీబీజీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే 110లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువు ద్వారా 15లక్షల ఎకరాల భూములను సారవంతంగా మార్చేందుకు ఉపకరిస్తుంది.