- ప్రత్యేక గుర్తింపు కార్డుతో అక్రమాలకు చెక్
- పథకాలకు ఏ శాఖకు ఆ శాఖ జారీ చేయాలి
- 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్
అమరావతి(చైతన్యరథం): అన్ని సంక్షేమ పథకాలకు ఏకైక అర్హత రేషన్‌కార్డు అనే విధానానికి స్వస్తి పలికి ఏ పథకానికి సంబంధించిన గుర్తింపు కార్డును ఆ శాఖ ద్వారానే జారీ చేయడం ద్వారా రేషన్ బియ్యం అక్రమ తరలింపు ముఠాను నియంత్రించవచ్చని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబరులో మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం పంపిణీలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఎంతో ఉందని, అందుకు ప్రత్యేక గుర్తింపు కార్డులు సంబంధిత శాఖ ద్వారా జారీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పీడీఎఫ్ బియ్యం దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పేదల బియ్యం దోపిడీ ముఠా ఆట కట్టిస్తుందన్నారు. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అవినీతి బియ్యం వ్యాపారంతో కాదని, సక్రమమైన ఎగుమతులు – దిగుమతులతో అనే విషయాన్ని అంద రూ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ఎన్టీఆర్ రూ.2లకే కిలో బియ్యం పథకం ప్రారంభించారని చెప్పారు.
ప్రధాని మోదీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రారంభించారని, దీనికి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇచ్చే బియ్యం అదనమన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే, ఆ బియ్యాన్ని విదేశాలకు మళ్లించడం ఎంతో క్రూరమైన చర్య అని మండిపడ్డారు. 2019 – 24 మధ్య పేదలకు అందాల్సిన రూ.80 వేల కోట్ల ఉచిత బియ్యంలో సింహ భాగం అవినీతిపరులకు ఆదా య మార్గంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచిత బియ్యం కోసం సంవత్సరానికి సగటున రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్న నిధులు దుర్వినియోగం కావడం బాధాకరమన్నారు. ప్రస్తుతం దాదాపు రూ.10 వేల కోట్లు కేంద్రానికి, రూ.6 వేల కోట్లు రాష్ట్రానికి ఉచిత బియ్యం కోసం వ్యయం అవుతుందని, గడచిన ఐదేళ్లలో రమారమి మొత్తం రూ.80 వేల కోట్లు ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఇప్పటివరకు అధికారుల నుంచి లభించిన సమాచారం మేరకు 2019 – 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం దాదాపు రూ.30,000 కోట్లు కాగా 59,08,146 రేషన్‌కార్డులకు 1,63,51,364 మంది లబ్ధిదారులు ఉన్నట్లు చెప్పారు. 2019 – 24 మధ్య కేంద్ర ప్రభుత్వం దాదాపు చేసిన వ్యయం రూ.49,200 కోట్లు కాగా 89,35,525 కార్డులకు 2,68,30,006 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. మొత్తం రేషన్‌కార్డులు 1,48,43,671 అయితే లబ్ధిదారుల సంఖ్య 4,31,81,370 మంది ఉన్నారని.. మొత్తం వ్యయం రూ.79,200 కోట్లు అవుతుందని వివరించారు.