తిరుమల: శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులని వ్యాఖ్యానించారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారు. ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ఇతర మతస్తులకు పెత్తనం అప్పగించడం వల్లనే తిరుమలలో ఇన్ని అనర్థాలు జరిగాయి. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతాం. దాని అధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తిరుపతి బీజేపీ నాయకులు అనేక పోరాటాలు చేశారు. తిరుమల కొండ మీద అరాచక పాలన ముగిసింది. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయి. స్వామివారి అస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని బండి సంజయ్ అన్నారు.