- సెంటుపట్టా కింద సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించలేదు
- కుమారుడ్ని పొట్టనపెట్టుకున్న వారిని శిక్షించాలి
- నారా లోకేష్ ఎదుట బాధితుల ఆవేదన
- ఉద్యోగ భద్రత, తాగునీరు, పింఛన్లపై పలువురి వినతులు
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న బాధలకు పరిష్కారం లభించక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారికి తాడేపల్లి ప్యాలస్ తలుపులు తెరుచుకోకపోవడంతో దిగాలుగా వెనుదిరిగాల్సిన పరిస్థితి ఉండేది. ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో తమ సమస్యలకు, కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’ కు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 17వ రోజు ‘‘ప్రజాదర్బార్’’ కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి సమస్యను వింటున్న యువనేత పరిష్కారానికి కృషిచేస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలకు ‘ప్రజాదర్బార్’ ద్వారా భరోసా లభిస్తుండటంతో ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. యువనేతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
నష్టపరిహారం చెల్లించలేదు
గత ప్రభుత్వంలో సెంటుపట్టా కింద సేకరించిన తమ అసైన్డ్ భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన రైతులు.. నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చినప్పటికీ మాజీ మంత్రి ఆళ్ల నాని అండతో సిబ్బంది అన్యాయం చేశారని యువనేత ఎదుట వాపోయారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ మినీ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేయాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఐటీ మేనేజర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు, డీఈవోలు, ఆఫీసు సబార్డినేట్స్ కు కాంట్రాక్ట్ పద్ధతి వర్తింపజేయాలని సిబ్బంది కోరారు. గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్న తమకు విపరీతమైన పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని, తగిన న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న ఎంటీబీ, ఎమ్‌ఎల్‌ఈలకు ఉద్యోగ భద్రత, కనీసం వేతనం కల్పించాలని ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయ సంఘం విజ్ఞప్తి చేసింది. పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ప్రేమ వివాహం చేసుకున్న కుమారుడిని హతమార్చారు
ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల అండతో యువతి కుటుంబ సభ్యులు కిరాతకంగా హతమార్చారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి మండలం నవులూరికి చెందిన సత్తెనపల్లి రామాంజనేయులు.. మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ గా పనిచేస్తున్న తన కుమారుడు సత్తెనపల్లి సీతారామాంజనేయులు, పాకనాటి స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు.. అది ఇష్టం లేని యువతి తండ్రి పాకనాటి శ్రీనివాసరెడ్డి, వారి కుటుంబ సభ్యుల సాయంతో కిరాతకంగా హత్య చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న మంత్రి లోకేష్.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భోరోసా ఇచ్చారు.
తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి
మంగళగిరి పట్టణం ఇప్పటం రోడ్డులోని గల్లా జయదేవ్ కాలనీ వాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. కాలనీలో 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, తాగునీరు సక్రమంగా అందడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువనేత భరోసాతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన ఎస్.పద్మజ కోరారు. అంధుడినైన తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన కె.వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన గంటి శ్రీనివాసరావు కోరారు. నూతన పెన్షన్లు మంజూరుతో పాటు గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని యువనేత భరోసా ఇచ్చారు.