అమరావతి (చైతన్యరథం): యూరియా అంశంపై సభలో చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా విషయంలో రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి తెలియజెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గత ప్రభుత్వం, తమ ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. యూరియా అంశంపై శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య గురువారం వాదోపవాదాలు జరిగాయి. యూరియా సహా రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబడుతూ తీర్మానం ఇచ్చారు. దీనిపై మండలి చైర్మన్ మోషేన్ రాజు స్పందిస్తూ.. తీర్మానాన్ని తిరస్కరించారు. మరో రోజు ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపడతామన్నారు. అయినా వైసీపీ సభ్యులు శాంతించకపోవడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. యూరియా అంశంపై చర్చకు వాయిదాలు ఎందుకని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ సభలో ఏ రోజు అజెండా ఆ రోజు ఉంటుందన్నారు. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోవడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏం చేసింది.. ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుందనే విషయాలు వారికి చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని.. చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.