- ఎన్జీటీ ఆదేశాలతో 2020లోనే ఆగిన పనులు
- తప్పులు దాచి, నీలి మీడియాలో కూటమి ప్రభుత్వంపై విషపు రాతలు
- డ్రామాలు ఆడడం, బురద జల్లడం జగన్కు అలవాటే
- రాయలసీమకు అసలు ద్రోహి జగన్
- సీమకు సాగు, తాగునీరందించిన ఘనత సీఎం చంద్రబాబుదే
- ఏపీ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదు
- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం
విజయవాడ (చైతన్యరథం): రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. జగన్ చేసిన తప్పిదాలను తన సొంత నీలి మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబును బూచిగా చూపి రాజకీయ ఉనికి చాటుకోవడం తెలంగాణ రాష్ట్ర అధికార, విపక్షలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. 2020లో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథక నిర్మాణం చేపడుతున్నామని జగన్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిందన్నారు. ఆ ప్రకటనపై ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో, కేంద్రంతో పాటు. ఎన్జీటీ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాయన్నారు. ఇదే విషయంపై అప్పట్లో మీడియాలోనూ ప్రచురితమైన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇపుడా తప్పిదాన్ని మభ్య పెడుతూ, తెలంగాణ సీఎం పేరుతో ఆయన సొంత మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికీ రాయలసీమకు జగన్ చేసిన ద్రోహమేనన్నారు. జగన్ రెడ్డి చేసిన తప్పు చేసి కప్పిపెట్టి, తమ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. విషపు రాతలు మానుకోకుంటే, జగన్ కు ప్రజలే మరింత గుణపాఠం చెబుతారని మంత్రి సవిత హెచ్చరించారు.
రాయలసీమ ద్రోహి జగన్
రాయలసీమ ద్రోహి జగన్ అని, తన రాజకీయ ఉనికి చాటుకోవడం కోసం డ్రామాలు ఆడడం ఆయనకు అలవాటేనని మంత్రి సవిత విమర్శించారు. 2024 ఫిబ్రవరి 26వ తేదీన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కుప్పం నియోజకవర్గానికి హంద్రీ-నీవాకాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు జగన్ డ్రామా ఆడారన్నారు. సినిమా సెట్టింగ్ మాదిరిగా ఓ గేటు పెట్టి… దాన్ని ఎత్తుతున్నట్లు మీడియా ముందు జగన్ హడావుడి చేశారన్నారు. ఆరోజు సాయింత్రానికి అదంతా ఒట్టి మోసమని తెలిపోయిందన్నారు. ప్రారంభించిన గేటు వెంట చుక్క నీరు కూడా పారలేదన్నారు. ఆ మరుసటి రోజు జేసీబీని తీసుకొచ్చి ఆ గేటును అక్కడి నుంచి తరలించిన విషయం మొత్తం మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచురితమైందన్నారు. డ్రామాల జగన్ రెడ్డి… ప్రాజెక్టులపై మాట్లాడడం సిగ్గు చేటని మంత్రి సవిత విరుచుకుపడ్డదారు. అయిదేళ్లలో జగన్ రాయలసీమలో ఎక్కడ్కెనా ఒక్క పిల్ల కాలువ తవ్వారా? అని ప్రశ్నించారు. కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కూడా పట్టించుకోలేదన్నారు. అన్నమయ్య డ్యామ్ గేట్ కొట్టుకుపోయి 42 మంది మృతిచెందినా జగన్ పట్టించులేదని మంత్రి సవిత మండిపడ్డారు.
ఏపీ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదు…
ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ప్రసక్తే లేదని మంత్రి సవిత తేల్చిచెప్పారు. రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత అన్న ఎన్టీఆỐన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు 2016-17లో గాలేరు-నగరి కాలువ ద్వారా గండికోట రిజర్వాయర్ నింపి పులివెందుల పైడిపాలెం ప్రాజెక్టుకు లిఫ్ట్ ద్వారా నీరందించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్కడి నుంచి సీబీఆర్ ప్రాజెక్టు ద్వారా కడపకు నీరందించామన్నారు.
40 ఏళ్లలో వైఎస్ కుటుంబం చేయలేని పనిని సీఎం చంద్రబాబు చేసి చూపించారని మంత్రి సవిత కొనియాడారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారని, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కుప్పం వరకూ సాగు నీరందించామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. రాయలసీమకు తాగు, సాగునీరు కల్పించిన ఘనత చంద్రబాబుదేని మంత్రి సవిత స్పష్టంచేశారు.















