- పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలన్న సీఎం చంద్రబాబు
- శాంతిభద్రతల అంశంపై నాలగున్నర గంటల సుదీర్ఘ సమీక్ష
- సిబ్బంది కొరతలేకుండా వ్యవస్థలో మార్పులు చేర్పులు
- సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై అప్రమత్తం
- లా అండ్ ఆర్డర్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
- విశాఖ పోలీసులు రూపొందించిన ప్రచార వీడియోల ఆవిష్కరణ
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నపుడే `పెట్టుబడిదారులు ఆకర్షితులవుతారని ఉద్భోదించారు. 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెండో రోజు శాంతి భద్రతల పరిస్థితిని సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించారు. నాలుగున్నర గంటలపాటు సాగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… కొత్త జిల్లాలు, సున్నిత ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువుండే దేవాలయాల వద్ద అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. “రాష్ట్రంలో నేరాల రేటు ఆరుశాతం మేర తగ్గింది. శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయి. ఆర్ధిక నేరాలు, సైబర్ ఫ్రాడ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. వీటిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నపుడే పెట్టుబడుదారులు ఆకర్షితులవుతారు. రోడ్ సేఫ్టీ చర్యలు మరింతగా విస్తతం చేయండి. అవసరమైనచోట ట్రామా సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. 503 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు సరిచేయండి. మహిళలపై నేరాలు తగ్గాయి… అయినా, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. రౌడీషీటర్లను కట్టడి చేయడానికి డ్రోన్లతో నిఘాపెట్టే అంశాన్ని పరిశీలించాలి. గత పాలనలో గంజాయి, అక్రమ మద్యం లాంటివి విచ్చలవిడిగా ఉండేవి. వదంతులు సృష్టించటం, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననంలాంటివి గతంలో సాగాయి. ప్రజా ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించండి. నెల్లూరులో రౌడీ ముఠాలను గుర్తించారు. ఇలాంటి ముఠాలు మిగిలిన జిల్లాల్లో ఉన్నాయేమో నిఘా పెట్టండి. డ్రగ్స్, గంజాయి గ్యాంగులను కట్టడి చేయంతో పాటు డీ-ఆడిక్షన్ కేంద్రాల ద్వారా మార్పు తీసుకురావాలి. నేరాలు జరిగినప్పుడు పోలీసులు కఠినంగా ఉంటే.. తప్పు చేయడానికి నిందితులు భయపడతారు. గంజాయి, డ్రగ్స్ చాలావరకు నియంత్రించారు. ఈ విషయంలో పోలీస్ శాఖకు అభినందనలు. అయితే, ప్రజల భద్రతను దష్టిలో పెట్టుకుని.. మత్తు జాడను పూర్తిగా నిర్మూలించండి. పోలీస్ శాఖ ఈ దిశగా బలమైన అడుగులు వేయాలి” అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.














