- వియత్నాంలో బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శన బాధ్యతలు అప్పగింత
- ప్రధాని కార్యాలయం నుండి ఆదేశాలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు అరుదైన గౌరవం లభించింది. వియత్నాంలోని హోచిమిన్ నగరంలో మే 1 నుండి 6వ తేదీ వరకు జరగబోయే బౌద్ధ ధార్మిక కార్యక్రమంలో భారత దేశం నుండి బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలను (కపిల్వాస్తు అవశేషాలు) ప్రదర్శించే నిర్వహణ బాధ్యతలను ఆయనకు కేంద్రం అప్పగించింది. ఈ బాధ్యతలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు అప్పగిస్తూ ప్రధాని కార్యాలయం (పీఎంవో) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వియత్నాం ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హోచి మిన్ నగరంలో ప్రదర్శించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను పటిష్ట భద్రత నడుమ భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్‌లో కేంద్రం పంపించనుంది.
బౌద్ధ మత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను మే1 న న్యూఢిల్లీ నుంచి వియత్నాం ప్రదర్శనకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 6 వరకు వియత్నాంలో ప్రదర్శన జరుగనుంది. ఈ ప్రదర్శనలో బుద్ధ భగవానుడి అవశేషాలను ప్రదర్శించనున్నారు. తద్వారా వియత్నాం, భారతదేశ బౌద్ధ సమాజాలు, ప్రజల మధ్య దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. బౌద్ధ మతం పరిఢవిల్లిన భారత నేల నుండి తీసుకెళ్లిన బుద్ధుడి పవిత్ర అవశేషాలను ప్రదర్శన పూర్తయిన తర్వాత మంత్రుల బృందం తిరిగి భారత్ తరలించనుంది. పీఎంవో ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. కాగా ఈ సమాచారం తెలిసిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ తనకు లభించిన అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.