- దిగ్బ్రాంతికి గురైన తెలుగు రాష్ట్రాలు
- తమ్ముడు మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు
- బాధాతప్త హృదయంతో ప్రకటించిన చంద్రబాబు
- తమ్ముడి ఆత్మకు శాంతికలగాలంటూ నివాళి
- రోహిత్, గిరీశ్‌లను అక్కున చేరుకున్న బాబు
- నిన్నటి వరకూ ధైర్యం.. నేటినుంచి జ్ఞాపకం
- చిన్నాన్నను గద్గద స్వరంతో గుర్తు చేసుకున్న లోకేష్
- ఏఐజీలో పార్దివ దేహం వద్ద పలువురి నివాళి
- నేడు నారావారిపల్లెకు పార్దివ దేహం
- మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు
- రామ్మూర్తి కుటుంబానికి పలువురి సంతాపం
హైదరాబాద్ (చైతన్య రథం): ఏపీ సీఎం చంద్రబాబునాయుడి సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి.. రామ్మూర్తి నాయుడు (72) మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 12:45 గంటలకు మరణించినట్లు ఏఐజీ వైద్యులు వెల్లడిరచారు. 1994లో తెదేపానుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. రామూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న సమాచారం అందుకున్న ముఖ్యమంత్ర్రి చంద్రబాబు ఆగమేఘాల మీద ఢల్లీినుంచి రాష్ట్రానికి వెనుతిరిగారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్ పూర్తి చేసుకుని.. అక్కడినుంచి మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన సీఎం చంద్రబాబు తన పర్యటనల రద్దు చేసుకుని ఏపీకి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.. ఏఐజీ ఆసుపత్రిలో తమ్ముడు రామ్మూర్తినాయుడు పార్థివ దేహం వద్ద నివాళి అర్పించారు. సోదరుడి కుమారులు రోహిత్, గిరీష్‌ను చంద్రబాబు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఏపీలోని అసెంబ్లీ, మండలి సమావేశాలతో బిజీగావున్న మంత్రి లోకేష్ సైతం `చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. సమాచారం అందిన మరుక్షణమే శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. లోకేష్ సోదరులు రోహిత్, గిరీశ్‌లకు ధైర్యం చెప్పి.. వారి వెంటే ఉన్నారు. రామ్మూర్తినాయుడు మరణించారన్న సమాచారం తెలియడంతో రాష్ట్రం దిగ్బ్రాంతికి గురైంది. అక్కడ నారావారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. నారా రామ్మూర్తినాయుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువర్గాలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రామ్మూర్తినాయుడు కడపటి చూపుకోసం బంధువర్గం, స్నేహితులు నారావారిపల్లెకు చేరుకుంటున్నారు. ఇదిలావుంటే, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు నారా రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల దగ్గరే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు రామ్మూర్తినాయుడు పార్థివదేహాన్ని తీసుకెళ్తారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నారావారిపల్లెకు తీసుకెళ్లి.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సందర్శనార్థం నాేరావారిపల్లెలో పార్థివదేహాన్ని ఉంచుతారు. అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలి: చంద్రబాబు
‘‘నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను. రామ్మూర్తినాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మానుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణించారని తెలిసి చింతిస్తున్నా. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలి. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నా. రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్, కుటుంబసభ్యులకు నా సంతాపం తెలుపుతున్నా’’
-ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
‘‘నారా రామ్మూర్తి నాయుడు మృతి ఎంతో బాధించింది. ఆయన కుటుంబం, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, తెదేపా కార్యకర్తలకు ఆయన మరణం తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’
-మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
‘‘నారా రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరం. ఆయన మృతి నారా కుటుంబానికి తీరని లోటు. ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ఆయన పార్టీకి చేసిన సేవలు వెలకట్టలేనివి. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలి’’
-కనకమేడల రవీంద్రకుమార్
ఇదిలావుంటే, రామ్మూర్తినాయుడు మృతి చెందారన్న సమాచారం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పరామర్శించారు. నారా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన బాలకృష్ణ, తీగల కృష్ణారెడ్డి, మోత్కుపలి నర్శింహులు రామ్మూర్తి నాయుడి భౌతిక కాయం వద్ద నివాళి అర్పించారు. రామ్మూర్తినాయుడి మృతిపట్ల మంత్రులు గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, నారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, దుర్గష్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సవిత, వాసంశెట్టి శుభాష్, కొండపల్లి శ్రీనివాస్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, ఎమ్మెల్యేలు యరపతినేని, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు, ధూళిపాళ నరేంద్ర, ఎం.ఎస్.రాజు, భాష్యం ప్రవీణ్, టీడీపీ నేత బీదా రవిచంద్ర, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
రామ్మూర్తిని గుర్తు చేసుకుంటున్న నారావారిపల్లె
నారావారిపల్లెకు తలలో నాల్కలా ఉండే రామ్మూర్తినాయుడిని గుర్తు చేసుకుని.. ఆ ప్రాంత ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రామ్మూర్తిని భోళాశంకరుడి మనస్తత్వమని, ఏ విషయాన్నైనా మొహం మీద అడిగేస్తాడంటూ స్నేహితులు, బంధువులు గుర్తు చేసుకున్నారు. అన్న చంద్రబాబు ప్రజల కోసం తీరికలేకుండా వున్నసమయంలో.. తమ్ముడిగా రామ్మూర్తి నాయుడే ఎక్కువగా కుటుంబ బాధ్యతలు మోశాడని కొందరు, నమ్మిన చంద్రగిరి నాయకులు కడవరకూ రామ్మూర్తినాయుడు వెంటే ఉన్నారని, నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత రామ్మూర్తినాయుడుకి చిరస్థాయిగా ఉంటుందంటూ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.