- కడ చూపు చూసేందుకు తరలివచ్చిన బంధువులు, ఆప్తులు, ప్రముఖులు, నేతలు
- తల్లిదండ్రుల సమాధుల వద్దే ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి అంతిమ సంస్కారాలు
చంద్రగిరి/ నారావారిపల్లి :- సీఎం చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తినాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్ర పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్థీవదేహాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంటకు తీసుకొచ్చి, అక్కడి నుండి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు తరలించారు. అభిమానులు, ఆప్తులు, బంధుమిత్రులు, నేతలు, ప్రజల సందర్శనార్ధం నారావారిపల్లెలోని సీఎం చంద్రబాబు నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు.
సోదరుడి కడ చూపుతో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రామ్మూర్తి నాయుడుకి నివాళులర్పించారు. చంద్రబాబు, లోకేష్, రామ్మూర్తి కుటుంబ సభ్యులు ఇందిర, రోహిత్, గిరీష్ లను పరామర్శించారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ జనసందోహం మధ్య రామ్మూర్తి నాయుడి అంతిమయాత్ర కొనసాగింది. రామ్మూర్తి నాయుడుని చివరి చూపు చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ్ముడి పాడెను చంద్రబాబు, లోకేష్ మోశారు. తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి దహన సంస్కారాలు చేపట్టారు.