అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ బుధవారం మూడు నామినేషన్ దాఖలయ్యాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉప సభాపతి పదవికి రఘురామ పేరు ఖరారు కావడంతో ఎన్డీఏ కూటమి మూడు పార్టీలకు చెందిన పలువురు మంత్రుల నేతృత్వంలో శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరకు ఆయన తరపున నామినేషన్ పత్రాలను అందజేశారు. శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరుని ప్రతిపాదిస్తూ ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల తరుపున మూడు నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. తెదేపా తరపున రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది మంత్రి నారా లోకేష్, జనసేన తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ తరపున పెన్మత్స విష్ణుకుమార్ రాజు వేరువేరుగా సంతకాలు పెట్టి ఉప సభాపతి పదవికి ఉండి శాసన సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు పేరును ప్రతిపాదిస్తూ మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
ఉప సభాపతి పదవికి నేటి ఉదయం జారీచేసిన నోటిఫికేషన్లో నేటి ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల్లోపు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనే నిబంధల మేరకు సాయంత్రం 4.30 గంటల సమయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నేటి సాయంత్రం 5.00 గంటలకల్లా నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగియడంతో, మరెవ్వరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు పర్చకపోవడంతో రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఉప సభాపతి పదవికి కనుమూరు రఘురామ కృష్ణంరాజును ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంన్నాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు గాజువాక శాసన సభ్యులు మరియు టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.