- భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధం
- యువత ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
- కేఎల్ యూనివర్శిటీ ప్లేస్‌మెంట్ సక్సెస్ మీట్‌లో మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి (చైతన్యరథం): విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విద్యార్థులు మార్కుల కోసం పోటీ పడడం కాకుండా నైపుణ్యాలు పెంచుకునేలా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు. గతంలో ప్రాక్టికల్ నాలెడ్జిని దూరం చేసి కేవలం థియరీకి పరిమితం చేశారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ నిర్వహించామని గుర్తు చేశారు. తాడేపల్లిలోని కె.ఎల్.యూనివర్శిటీ ప్లేస్‌మెంట్ సక్సెస్ మీట్‌లో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లో ప్లేస్‌మెంట్ పొందిన విద్యార్థులకు మెమెంటోలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ అద్భుతమైన ఫలితాలు అత్యత్తుమమైన దూరదృష్టి, క్రమశిక్షణ, పట్టుదలతో మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. గతంలో ఐటీ గురించి, విజన్ 2020 గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడితే చాలా మంది హేళన చేశారు. కానీ నేడు ఆ ఫలితాలు హైదరాబాద్ రూపంలో కళ్ల ముందు కనిపిస్తున్నాయి. నాడు చంద్రబాబు చూపిన మార్గం నేడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు విద్యార్ధులు ఐటీని శాసించే స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు విజన్ 2047 రూపొందించడంతో పాటుగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించేందుకు అవసరమైన మార్గాలు చూపించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారని మంత్రి రవీంద్ర తెలిపారు.
ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
చంద్రబాబు విజన్ గురించి తెలుసుకుని ఆదిశగా అడుగులు వేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యువత కూడా ఆ మహత్కార్యంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త ఉండాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ఇక్కడున్న యువత ఉద్యోగాలు చేయడంతో పాటుగా.. ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని మంత్రి రవీంద్ర ఆకాంక్షించారు.
ఐదేళ్ల వైసీపీ పాలన సృష్టించిన విపత్కర పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. పోలవరం నిర్మాణంతో వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అడుగులు వేస్తూనే.. భవిష్యత్ నిర్మాణం దిశగా అమరావతి పనులు చేపట్టాం. సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లినపుడే సరికొత్త విజయాలు సాకారమవుతాయి. రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. మన వద్ద లభించే ఖనిజాలను నేరుగా ఎగుమతి చేయడం కాకుండా.. విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి మరింత ఆదాయం సముపార్జించేలా చూడాలి. అందుకోసం భూగర్భ వనరుల శాఖ మంత్రిగానా వంతు కృషి నేను చేస్తున్నాను. విద్యార్థి దశలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. ఉద్యోగాలు పొందిన వారు, మెరుగైన ఉపాధి దక్కించుకున్న వారు తమ తోటివారిని కూడా ప్రోత్సహించాలి. అప్పుడే ముఖ్యమంత్రి ప్రకటించిన పీ 4 కార్యక్రమం విజయవంతం అవుతుంది. కె.ఎల్.యూనివర్శిటీ ఇలాంటి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.