- తగిన ప్రభుత్వ విధానాన్ని రూపొందించండి
- రాష్ట్రంలో ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం
- మైనింగ్‌లో శాటిలైట్, డ్రోన్ చిత్రాల ద్వారా విశ్లేషణ
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం
- గనులు, ఉచిత ఇసుక విధానంపై సమీక్ష
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడిరపుతోనే అదనపు ఆదాయం వస్తుందని సీఎం సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖ, ఉచిత ఇసుక విధానంపై సీఎం సమీక్ష నిర్వహించారు. మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూ.3320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంతో పోలిస్తే 34శాతంమేర అదనంగా గనుల శాఖనుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మాంగనీస్‌లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతానికిపైగా ఆదాయం వస్తోందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ఏపీలో ఉన్న మినరల్ వెల్త్ విలువను అంచనా వేయాలని సూచించారు. ఒడిశాలాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని.. రూ.50 వేల కోట్ల ఆదాయం ఖనిజాలనుంచే వస్తోందని సీఎం తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారు చేసి విలువ జోడిస్తే రూ.20-30 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. పెండిరగ్‌లోవున్న 6500 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.
వడ్డెర్లకు మైనింగ్ లీజులు.. మార్గదర్శకాలు రూపొందించండి
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వడ్డెర్లు, సొసైటీలకు 15శాతంమేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్‌లో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వెనుకబడిన వర్గాలైన వడ్డెర్లకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగేలా లీజు కేటాయింపు విధానాన్ని రూపొందించాలని సీఎం స్పష్టంచేశారు. సీనరేజి, ప్రీమియం మొత్తాల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మైనింగ్ లీజుల కేటాయింపుతోపాటు వారు ఎంఎస్‌ఎంఈలుగా ఎదిగేందుకూ ప్రస్తుతమున్న పాలసీని అనుసంధానించాలన్నారు. రాష్ట్రంలో గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించాలన్నారు. అనలటిక్స్‌ను వినియోగించుకుని జరిగిన తవ్వకాలను అంచనా వేయాలన్నారు. బీచ్ శాండ్ మినరల్స్‌లాంటి భార ఖనిజాల మైనింగ్‌తోపాటు విలువ జోడిరపు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అలాగే కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌కు ముడి ఇనుము ఖనిజం సరఫరాపైనా అధ్యయనం చేయాలని సూచించారు.
ఉచిత ఇసుకతో ప్రజలకే ప్రయోజనం దక్కాలి
ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం కలగాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఉచిత ఇసుక సరఫరాను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వినియోగించుకుని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సీజన్ కోసం 66.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశామని.. ప్రస్తుతం అన్ని స్టాక్ పాయింట్లలోనూ 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనం దక్కేలా ఇసుక లభ్యత జరగాలన్నారు. ఇసుక లోడిరగ్‌తోపాటు రవాణాకు అతితక్కువ వ్యయం అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక లభ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని రూట్లలో పెట్టిన సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేయాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఉచిత పంపిణీ విధానంపై పర్యవేక్షించాలని సీఎం అన్నారు. సమీక్షకు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీఎస్ అధికారులు హాజరయ్యారు.