- అందుకు ప్రతి విద్యార్థి సన్నద్ధం కావాలి
- వైద్యరంగంపై పీఎం, సీఎం ప్రత్యేక శ్రద్ధ
- మెడికోస్‌కు మంత్రి సత్యకుమార్ పిలుపు
- మంత్రిగా నేనూ మెడికల్ స్టూడెంట్‌నేనని వ్యాఖ్య
విజయవాడ (చైతన్య రథం): వైద్య విద్యను పూర్తిచేశాక ప్రభుత్వ వైద్యరంగంలో సేవలందించేందుకు ముందుకు రావాలని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నిరుపేదలకు సేవచేసే భాగ్యం ప్రభుత్వ వైద్యరంగంలో కలుగుతుందన్నారు. ‘నన్ను డాక్టర్‌ని చేయాలని నా సోదరి తపన పడిరది. కానీ ఆరోగ్య మంత్రినయ్యాను. మంత్రి అయ్యాక వైద్యారోగ్య శాఖకు సంబంధించి అనేక విషయాల్ని డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందినుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను కూడా మెడికల్ స్టూడెంట్‌నే…’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ చమత్కరించారు. కృష్ణా జిల్లా చిన అవుట్‌పల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ `2025 బ్యాచ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. వైద్యరంగానికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
సమాజంలో ఏ వృత్తికీ లేనంత గౌరవం, ప్రాధాన్యత వైద్యవృత్తికి ఉందన్నారు. రానురాను వైద్య వృత్తిలో విలువలు తగ్గుతున్నాయని, వ్యాపారమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యనభ్యసించిన మీరంతా అంకిత భావంతో పనిచేయాలన్నారు. వైద్యవృత్తికి మానవతావాదాన్ని, సేవాభావాన్ని అద్ది ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడిననాడే వైద్యులకు గౌరవం పెరుగుతుందన్నారు. పదేళ్ల కాలంలో 73,000 ఎంబిబియస్ సీట్లు రావడంలోనూ, పీజీ సీట్లు రెండురెట్లు పెరగడంలోనూ ప్రధాని మోదీ కృషి ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ స్కీంను తీసుకొచ్చి, ఖరీదైన చికిత్సల్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందించాలని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. ప్రధాని మోడీ దిశానిర్దేశంలో 2047నాటికి అభివృద్ధిలో దేశం రెండో స్థానానికి చేరుకోవడం ఖాయమన్నారు. జీవితంలో వినోదం అవసరమని, వినోదమే జీవితం కాదనే వాస్తవాన్ని నేటి యువత తెలుసుకోవాలని, భారత నిర్మాణంలో యువతే కీలక పాత్ర పోషించాలని మంత్రి హితవు పలికారు. యువత గురుతర బాధ్యతను గుర్తుచేసిన మంత్రి.. వైద్య విద్యార్థుల్ని తన ప్రసంగంతో ఎంతగానో ఉత్తేజపరిచారు
పునాదుల్లోనే మెడికల్ కాలేజీలు
గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అరకొర వసతులు నెలకొన్నాయని, మరికొన్ని కాలేజీలు పునాదులకే పరిమితమయ్యాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రూ.8,500 కోట్లకు గాను, కేవలం రూ.1550 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చుపెట్టిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. పేద వైద్య విద్యార్ధులకు నాణ్యమైన వైద్య విద్యనందించాలన్న ఉద్దేశంతోనే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పీపీపీ విధానంలో చేపట్టడం వల్ల గతంలో ఉన్న ఆలిండియా కోట్ల సీట్ల కేటాయింపు ఉండదని, దీంతో 110 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కుతాయన్నారు. ప్రస్తుతమున్న ప్రభుత్వాసుపత్రుల్ని బలోపేతం చేయడంతో పాటు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్ పిన్నమనేని సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ (మేజర్) ఎమ్మీ భీమేశ్వర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, సిద్దార్ధ అకాడమీ ప్రెసిడెంట్ మాలినేని రాజయ్య, సెక్రటరీ పాలడుగు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.















