- ప్రజా ప్రయోజనమే కలెక్టర్ల అంతిమ లక్ష్యం కావాలి
- సీఎం చంద్రబాబు ఆలోచనలను అందుకునేలా పనిచేయాలి
- కలెక్టర్ల సదస్సులో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తి శాతం పెరిగేలా జిల్లా కలెక్టర్లు, అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో తొలిరోజు సోమవారం మంత్రి పయ్యావుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు వినూత్నంగా ఉంటాయని, ఆయన ఆలోచనలు ఎంతో ముందుచూపుతో ఉంటాయన్నారు. ఆయన ఆలోచనలు, ఆకాంక్షలను ప్రజలవద్దకు చేర్చి, అవి ప్రతిఫలించేలా కృషి చేయడంలో జిల్లా కలెక్టర్లే ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ పథకాలు జిల్లాల్లో సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లేదనని, పథకాల అమలులో ప్రజా సంతృప్తి స్థాయి పెరిగేలా కృషి చేయాలన్నారు. మనందరం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి పనిచేద్దామని ఆయన కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ముఖచిత్రాన్ని క్షేత్ర స్థాయిలో ప్రతిభవించే విధంగా జిల్లా కలెక్టర్లు కృషి చేయాలి. కొత్త విషయాలను కొత్తగా ఆలోచించే ఎనర్జీ, ఉత్సాహం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి.
గతంలో ప్రణాళిక శాఖ అంటే కేవలం ఏదో గణాంకాల నమోదుకు మాత్రమే పరిమితమైన శాఖగా ఉండేదని, ఇప్పుడు ఆ శాఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంతో కీలకమైన శాఖగా మార్చారన్నారు. ఈ శాఖను సమర్థవంతంగా వినియోగించు కోవడం వల్ల జీఎస్‌డీపీ సాధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలపగలిగాం. జాతీయస్థాయి జీఎస్‌డీపీ8.8% ను అధిగమిస్తూ రాష్ట్రం 10.8% జీఎస్‌డీపీ ని సాధించింది. సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచనలతో రాష్ట్ర ఆర్థికవ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ సంపదను సృష్టిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో అంకితభావంతో పనిచేస్తూ 2026 కార్యచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని మంత్రి పయ్యావుల పిలుపునిచ్చారు.