- ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం
- పాపులస్ సంస్థ’తో భేటీలో లోకేష్ ప్రతిపాదన
ఆస్ట్రేలియా (బ్రిస్బేన్): పాపులస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లఘర్, పాపులస్ ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్ మెంట్, బిడ్స్ అండ్ కమ్యూనికేషన్ హెడ్ ఎలిజిబెట్ డిసిల్వాలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ బ్రిస్బేన్‌లో భేటీ అయ్యారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన స్టేడియాలకు వినూత్నమైన డిజైన్ రూపకల్పన, నిర్మాణంలో పాపులస్ ఆర్కిటెక్ట్స్ సంస్థ పేరొందింది. క్రీడా సౌకర్యాలు, మైదానాలు, ఈవెంట్ స్థలాల డిజైనింగ్, నిర్మాణంలో 40సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన పాపులస్ 60 బిలియన్ డాలర్ల విలువైన 3,500కు పైగా ప్రాజెక్టులను చేపట్టింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం, యూకేలోని లండన్ ఒలింపిక్ స్టేడియం, కాలిఫోర్నియాలోని సోఫీ స్టేడియం, అట్లాంటా జార్జియాలోని మెర్సిడస్ బెంజ్ స్టేడియం, న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంల డిజైన్లు పాపులస్ సంస్థ రూపొందించినవే. భారత్‌లో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఎల్ అండ్ టీతో కలసి పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌కు అనుగుణంగా అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియంలు, శిక్షణా సౌకర్యాలకు డిజైన్లు అందించి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రపంచ పర్యావరణ ప్రమాణాలతో స్థిరమైన, ఎనర్జీ ఎఫీషియంట్ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వేదికల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో క్రీడలు, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రోత్సహించడానికి కమ్యూనిటీ క్రీడా సముదాయాలు, వినోద స్థలాల అభివృద్ధికి కమ్యూనిటీ సెంట్రిక్ డిజైన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. టూరిజం, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేలా సాంస్కృతిక, క్రీడలు, వినోద కార్యక్రమాల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ ఈవెంట్ స్పేస్ అభివృద్ధికి పట్టణ ప్రణాళిక ప్రాజెక్టులపై డిజైనింగ్ సహకారాన్ని అందించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.













