- డిమాండ్ మేరకు రైతులకు ఎరువుల అందజేత
- అందుబాటులో 77 వేల మెట్రిక్ టన్నులు..
- మరో 10 రోజుల్లో రానున్న 41 వేల టన్నులు
- ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి
- ఎరువుల విషయంలో రైతులకు భరోసానివ్వండి
- రబీనాటికి వెబ్ ల్యాండ్, ఈ-పంట ఆధారంగా పంపిణీ
- టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
- హాజరైన కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయాధికార్లు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతోందని.. రైతుల డిమాండ్ మేరకు ఎరువులు అందుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారులు వివరించారు. ఎరువుల లభ్యత, సరఫరా అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ తీసుకున్నారు. ఎరువుల సరఫరాపై రైతులనుంచి నేరుగా తాను తెప్పించుకున్న ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సీఎం రివ్యూ చేశారు. అధికారులు ఇచ్చే సమాచారంతోపాటు ఆయా జిల్లాలనుంచి తెప్పించుకున్న సమాచారాన్ని పోల్చి ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్లు ఏయే జిల్లాల్లో ఎంతెంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి… డిమాండ్ ఎలా ఉంది? అనే విషయాలను ముఖ్యమంత్రికి వివరించారు.
డిమాండ్‌కు సరిపడా ఎరువుల లభ్యత
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. రేపు కాకినాడ పోర్టుకు ఒక వెసల్ వస్తోందని… దీనినుంచి 15 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్రంలో అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. ఇవి కాకుండా మరో 10 రోజుల్లో 41వేల టన్నుల ఎరువులు రాష్ట్రానికి అదనంగా రానున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే బాపట్ల, కృష్ణా, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరత ఉందని… ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇతర ప్రాంతాలనుంచి తెప్పిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ సమస్య కూడా సత్వరమే పరిష్కరించాలని సీఎం సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి… జిల్లా కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీలించాలని సీఎం సూచించారు. ఎరువుల లభ్యత గురించి రైతులకు వివరించి వాళ్లు ఎటువంటి ఆందోళన పడకుండా చూడాలన్నారు. అందరికీ ఎరువులు అందుతాయనే భరోసాను రైతులకు కలిగించాలన్నారు.
వచ్చే రబీలో వెబ్ ల్యాండ్ -ఈ పంట అనుసంధానంతో రైతుల ఆధార్ ఆధారంగా ఎరువులు సరఫరా చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. దీనికోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలన్నారు. ఎవరు ఎంత పంట వేస్తారో ఈ`పంట నమోదు ద్వారా చూసి వారికి అవసరమైన మేరకు ఎరువులు ఇచ్చే మెకానిజం తీసుకురావాలి. దీని కోసం అవసరమైన డేటా అనుసంధానం జరగాలని సీపం అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి బాధ్యత తీసుకుని రైతులకు ఎరువుల సరఫరాపై అవగాహన కల్పించడాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అన్ని జిల్లాల్లో ఈ తరహా కార్యక్రమం చేపట్టి… ఎరువుల సరఫరాలో ఉన్న అన్ని అనుమానాలను తొలగించాలని సూచించారు. అధికారులు సత్వర స్పందన, సమన్వయంతోనే స్పందించే ప్రభుత్వంగా ప్రజలు గుర్తిస్తారని అధికారులకు సీఎం తెలిపారు.