- జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు చేకూరే లబ్ది ఇది
- యోగాంధ్ర తరహాలో పెద్దఎత్తున ప్రచారం చేయండి
- అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయాలి
- పారదర్శకతకు అద్దంపట్టేలా ఎక్సైజ్ శాఖ పనితీరుండాలి
- ప్రజలకు మంచి చేస్తున్నాం… సంతృప్తస్థాయీ పెరగాలి
- రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాకులో రెవెన్యూ, భూములు, ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “రెవెన్యూ విభాగానికి వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతంమేర ఆర్ఓఆరు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. గత పాలకుల తప్పులతో ఈ స్థాయిలో రెవెన్యూ, భూవివాదాల ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు, భూములు ఇలా వేర్వేరు అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. 22ఏలో భూములు పెట్టేయటంలాంటి చర్యలవల్ల ఈ దుష్పలితాలు వచ్చాయి. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించింది. ఇప్పుడా చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల రక్షణకు వీలుగా చట్టాన్ని తెచ్చాం. భూముల్ని కాజేయడానికి 22ఏలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశారు. రీసర్వే చేసి ఈ రికార్డులను సరి చేయాలి. నిర్దేశిత గడువులోగా వీటిని ప్రక్షాళన చేయాలి. వివిధ ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. కులం ఎవరిదీ మారిపోదు. దానిని శాశ్వత ప్రాతిపదికన ఇవ్వాలి.
నివాస, వయో ధృవీకరణ కోసం ప్రతీ ఏటా జారీ చేయొచ్చు. 2027కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. రికార్డులన్నీ ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా పని చేయాలి. జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ కూడా పెట్టి రికార్డులు ఇస్తాం. గ్రామ కంఠంలోని ఆస్తులకు స్వమిత్వ పథకం కింద యాజమాన్య పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలి. సింహాచల భూముల పంచ గ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోండి. రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ధరలు తగ్గిన విధానం ప్రజలకు తెలపండి
“జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర ప్రయోజనం ప్రతీ ఏటా కలుగుతుంది. పన్నుల తగ్గింపుపై ఈనెల 19న నోటిఫికేషన్లను జారీ చేసేలా కార్యాచరణ. గ్రామస్థాయి వరకూ ఏ వస్తువుకు ఎంత పన్ను తగ్గిందన్న అంశాలను ప్రజలకు తెలిసేలా ప్రకటన జారీ చేయండి. జీవిత బీమా, ఆరోగ్య బీమాపై ఇప్పుడు జీఎస్టీ లేదు.
ఈ క్రమంలో యూనివర్సల్ హెల్త్ కార్డ్ప ఏమేరకు ప్రయోజనం కలుగుతుందో అంచనా వేయండి. జీఎస్టీ పన్నుల తగ్గింపు ప్రయోజనాలపై నెల రోజులపాటు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. యోగాంధ్ర విషయంలో ఎంత పెద్ద రికార్డు సృష్టించే దిశగా ఏస్థాయి ప్రచారం చేశామో… జీఎస్టీ సంస్కరణల విషయంలోనూ అదేస్థాయిలో ప్రచారం చేయాలి. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 22వరకూ ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గోనేలా కార్యాచరణ రూపొందించాలి. జిల్లాల నుంచి జీఎస్టీ, పన్ను ఆదాయాలు ఎలా ఉన్నాయన్న దానిపైనా పర్యవేక్షణ చేయండి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రజల సంతృప్తే ముఖ్యం
“ఆదాయాలు తగ్గకుండా జిల్లా కలెక్టర్లు ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా మైనింగ్ ఆదాయంలో ఏ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయో బేరీజు వేస్తాం. కొన్ని జిల్లాల్లో ఆదాయం గణనీయంగా పడిపోవటం వెనుక కారణమేమిటో విశ్లేషించాలి. జిల్లాలవారీగా మైనింగ్ ఆదాయం పెరగాలి. మైనింగ్ ఎక్కువ ఉన్నచోట వ్యాల్యూ అడిషన్కు వెళ్లాలి. ప్రతీ నెలా రెవెన్యూ రియలైజేషన్, జీఎస్టీపీపై సమీక్షించుకుంటున్నాం. ఉచిత ఇసుక విధానంలో ప్రజల్లో సంతృప్తిస్థాయి రావాలి. రూ.1000 కోట్ల రెవెన్యూను ప్రభుత్వం కోల్పోయి ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తోంది. ఇలాంటి అంశాల్లో ప్రజలు సంతృప్తి పడేలా ఉండాలి. ఇసుక సరఫరాపై మేం ఎప్పటికప్పుడు సర్వేలు చేపడుతున్నాం. ఉచిత ఇసుక విధానంపై ప్రజల సంతృప్తస్థాయి మరింతగా పెరగాల్సి ఉంది. ప్రభుత్వం పైసా కూడా ఆశించకుండా ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తోంది. కేవలం రవాణా ఖర్చులు మాత్రమే వారు భరించాలి. ఇసుక తీసుకెళ్లేందుకు ముందుకొచ్చిన ప్రజలను అడ్డుకోవద్దు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
బీపీఎస్-ఎల్ఆర్ఎస్ స్కీమ్ కలెక్టర్లు ఫోకస్ పెట్టాలి
“తిరుపతి ఎర్రచందనం డిపో సీసీ టీవీలను ఏర్పాటుచేసి పర్యవేక్షించండి. ఎర్రచందనం దుంగలను వ్యాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులు తయారు చేయండి. అలాగే ఎర్రచందనం ఉత్పత్తులు, ఇతర అంశాలు తెలియచేసేలా డిపోవద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. మోటారు వాహనాల పన్నులపై కలెక్టర్లు దృష్టి సారించాలి. మున్సిపల్ విభాగం శాటిలైట్ చిత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించేలా ప్రక్రియ చేపట్టండి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ను పూర్తి చేసేలా కలెక్టర్లు ఫోకస్ చేయాలి. కొత్త లే-అవుట్లల్లో డ్రెయిన్లకు స్థలం కేటాయించేలా అధికారులు దృష్టి సారించాలి. స్వర్ణ పంచాయత్ పోర్టల్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద కుంభకోణం లిక్కర్ స్కాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ శాఖను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ప్రొక్యూర్మెంట్ మాన్యుఫాక్చరింగ్, విక్రయం వరకూ అంతా పారదర్శకంగా జరగాలి. ఆన్లైన్ పేమెంట్లు 100 శాతం జరగాల్సిందే. ప్రపంచ ప్రమాణాలతో రీహాబిలిటేషన్, డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయండి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.