శ్రీకాకుళం (చైతన్యరథం): కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరం. నా ఆలోచనంతా. కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మృతులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అత్యంత విషాదకరం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఆలయ తొక్కిసలాట ఘటన అత్యంత విషాదకరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
తీవ్రంగా కలచివేసింది: పవన్ కల్యాణ్
కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని పేర్కొన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులని ఆదేశించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి తమ ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుందని భరోసా కల్పించారు. ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని వెల్లడిరచారు. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులని ఆదేశించారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు.
సమగ్ర విచారణ: హోం మంత్రి అనిత
కాశీబుగ్గ తొక్కిసలాటపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్పీ సహా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. శనివారం ఏకాదశి కావడం వల్ల మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి వచ్చారని వెల్లడిరచారు. వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు వెళ్లిన సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని వివరించారు. మొదటి అంతస్తులో స్వామివారి ఆలయం ఉంటుందని.. మెట్లు ఎక్కే సమయంలో రైలింగ్ విరిగిపడి ఈ దుర్ఘటన జరిగిందని వెల్లడిరచారు. రైలింగ్‌తో పాటు భక్తులు పడిపోవడంతోనే ఇంతమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఒకేసారి 15 వేల మంది వచ్చేసరికి తోపులాట జరిగిందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా విషాదకర ఘటన అని తెలిపారు. భక్తులు ఎవరూ ఆందోళనకి గురికావొద్దని ధైర్యం చెప్పారు. ఫైర్, పోలీస్ శాఖల అధికారులు తక్షణం సహాయ కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనలో చనిపోయిన కుటుంబసభ్యులందరికీ తన ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. సింహాచలం, తిరుపతి ఘటనల తర్వాత ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. పర్వదినాల సమయంలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
మృతుల కుటుంబాలకు మంత్రి ఆనం సానుభూతి
తొక్కిసలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే జిల్లా మంత్రి అచ్చెన్నాయయడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అదేశించారు. మంత్రి ఆనం ఆదేశాలతో ఉన్నతాధికారులు హుటాహుటిన శ్రీకాకుళం బయలుదేరారు.
మంత్రి దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిలాట ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మరణం ఆవేదనకు గురి చేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశిబుగ్గ ఆలయంలో ఏకాదశి పర్వం సందర్భంగా భక్తుల తాకిడి భారీగా ఉంటుందని అంచనా వేసి ఏర్పాట్లు పకడ్బందీగా చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. దర్శనాల సమయంలో ఉదాసీనత పనికిరాదని హెచ్చరించారు. భక్తులకు ఏర్పాట్ల విషయంలో ఆలయాల్లో తగు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.













