- పూర్తికాని ప్రాజెక్ట్ జాతికి అంకితమా..
- తిరోగమన సామ్రాట్, అభినవ తుగ్లక్ బిరుదులకు అర్హుడు జగన్
- వెలిగొండలోనే వాస్తవాలు తేలుద్దాం
- జగన్‌కు మంత్రి రామానాయుడు సవాల్
పాలకొల్లు (చైతన్యరథం): వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలు ఎవరివో, వక్రీకరణలు ఎవరివో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ….జగన్ వస్తే జనం మధ్యలోనే చర్చకు సిద్ధమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో రూ 3 కోట్లతో చేపట్టిన నరసాపురం ప్రధాన కాలవపై వంతెన అప్రోచ్ పనులు, తాగునీటి సరఫరా పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. అబద్ధానికి హద్దులు, సరిహద్దులు ఉండవని, ఏదైనా మాట్లాడొచ్చు.. ఎలా అయినా మాట్లాడొచ్చన్నారు.అయితే అబద్ధాలు చెప్పే వాడికి అపార జ్ఞాపకశక్తి ఉండాలి.. లేకపోతే వేర్వేరు సందర్భాల్లో వేర్వేరుగా మాట్లాడి దొరికి పోతుంటారు. ఇలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డదిడ్డంగా అబద్ధాలు ఆడి ప్రతిసారి ప్రజల ముందు చులకన అయి అడ్డంగా దొరికి పోతున్నారన్నారని మంత్రి నిమ్మల చురకలు అంటించారు.
దొంగే..దొంగ దొంగ అని అరిచినట్లుగా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్ మంత్రిగా మూడుసార్లు క్షేత్రస్థాయిలో సందర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నట్లు చెప్పారు. ఆయకట్టు పరిధిలోని రైతులతో మాట్లాడడమే కాకుండా అధికారులతో పలు దఫాలుగా చర్చించామన్నారు. వాస్తవ పరిస్థితులు, గణాంకాలు ఆధారంగానే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడానని, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వెలుగొండ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తే అబద్ధాలకు అర్ధసత్యాలకు వేదికైన సాక్షి పత్రికలో నిమ్మల వక్రీకరణలు అంటూ నిందారోపణలు చేయడం దొంగే.. దొంగ దొంగ..అని అరిచినట్లుగా ఉందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కానట్లుగా ఆ దిక్కుమాలిన రాతల్లోనే ఒప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు వెలిగొండ ప్రాజెక్టుని జగన్ జాతికి ఎలా అంకితమిచ్చాడని మంత్రి నిమ్మల ప్రశ్నించారు.
ప్రపంచంలో ఎక్కడైనా పూర్తిగాని ప్రాజెక్టులను ఎవరైనా ప్రారంభిస్తారా? అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు. లేనివి ఉన్నట్లు..ఉన్నవి లేనట్లు అబద్ధాలు చెప్పడంలో జగన్ అంత ఘనాపాటి మరెవ్వరూ లేరన్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ప్రగతిలో పురోగతి పాలన చూసాం తప్పితే.. రివర్స్ పాలన అంటే తిరోగమన పాలన ఒక్క జగన్ హయాంలోనే చూసామన్నారు. ఈ రకంగా జగన్‌కు తిరోగమన సామ్రాట్‌గా, అభినవ తుగ్లక్‌గా బిరుదులు ఇవ్వచ్చని మంత్రి రామానాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వెలిగొండకు సంబంధించి మొన్నటి వరకు ప్రాజెక్టు మొత్తం పూర్తయింది, జాతికి అంకితం చేసామని చెప్పుకొచ్చారనీ, ఇప్పుడు ప్రాజెక్టు మొత్తం కాదు రెండు సొరంగాలు పూర్తి చేసామని కొత్త అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రజలను ఏ మార్చడం మానుకోవాలన్నారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి, ప్రపంచంలో ఎవరినైనా వంచించడానికి వెనుకాడడని విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి, ఆ ప్రాజెక్టు పరిధిలోనే వాస్తవాలు తేల్చేందుకు చర్చకు రావాలని జగన్‌కు మంత్రి రామానాయుడు సవాల్ విసిరారు.