- ఈ ఏడాదినుంచే అమలుకు శ్రీకారం
- బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం సమీక్ష
అమరావతి (చైతన్య రథం): ఉభయ సభల్లో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఈనెల 28న ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 24నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాదినుంచి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్‌లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కారుకు సవాల్‌గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. 2024-25 సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో 5 నెలల కాలానికిగాను నవంబర్‌లో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈనెల 24నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుంటే.. 28 సభ ముందుకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను తేనున్నారు. గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఆర్థిక ఆరోగ్యసూచిలో రాష్ట్రం అట్టడుగు చేరిన నేమథ్యం.. భవిష్యత్ ఆదాయాలను కూడా గత ప్రభుత్వం వాడేసిన వైనం.. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌పై నిధులు ఖర్చు చేయకపోవడంతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులు.. ఇవన్నీ కూటమి సర్కారుకు సవాళ్లే. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఉచిత ఇసుకవంటి పాలసీతో ప్రభుత్వం ఆదాయాన్ని వదులుకుంది. అధికారంలోకి వచ్చిన మొదటినెల నుంచే పింఛన్లను రూ.4వేలకు పెంచారు. ఒక్క పింఛన్లపైనే సరాసరి నెలకు రూ.2720 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా దీపం `2, అన్న క్యాంటీన్లు వంటి పథకాలూ ప్రారంభమయ్యాయి. పైగా ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం, అన్నదాత, ఉచిత బస్సు వంటి పథకాలకు ఈ ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కూర్పు కూటమి ప్రభుత్వానికి పెను సవాల్‌గానే పరిణమిస్తోంది. అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు కేంద్రసాయంతో కొంత ఊరట లభించినా.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో ప్రత్యేక సాయం అందించాలని 16వ అర్థిక సంఘాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సంక్షేమం ఇస్తూ…అభివృద్ది పనులను కొనసాగిస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్ కూర్పుపై విస్తృత కసరత్తు చేస్తోంది.