- దారి పొడవునా తెదేపా అధినేత పట్ల వెల్లడైన ప్రజావిశ్వాసం, అభిమానం
- ఈ ప్రజా ప్రభంజన పరిణామంపై ఆసక్తికర చర్చ
- వార్ వన్ సైడా?… అంతేగా అంటున్న పరిశీలకులు
అమరావతి : స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం ఒక సంచ లనాన్ని సృష్టించింది. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటినుంచీ వినూత్నరీతిలో ఆయన రాష్ట్ర మంతా కలియతిరిగారు. ఎన్టీఆర్ పర్యటనలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ప్రభంజనాన్ని సృష్టించా యి. దారి పొడవునా ప్రజలు ఆయనకు నీరాజనం పట్టారు. సభలకు ఎన్టీఆర్ రాక కోసం గంటలు, రోజుల తరబడి ఆలస్యమైనా ప్రజలు వేచి ఉన్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలకు వచ్చిన అశేష స్పం దన.. వాటిని స్వయంగా చూసిన, విన్న వారందరి మనస్సుల్లో ఇప్ప టికీ చిరస్మరణీయంగా నిలిచింది. ఆయనకు వచ్చిన విశేష ప్రజాస్పందనను గమనించిన రాజకీయ నాయ కులు, పరిశీలకులు, పత్రికల వారు 9 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో తెదేపా ఘన విజయం తథ్యమని ముందుగానే తీర్పు ఇచ్చారు. ఆ ముందస్తు తీర్పుని వాస్తవం చేస్తూ 1983లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మున్నెన్నడూ రాష్ట్రంలో చూడని విధంగా తెదేపా భారీ విజయాన్ని సాధించడంతో నందమూరి తారక రామారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇదంతా కేవలం 9 నెలల్లోనే. ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం స్థాయికి ఆ భారీ విజయం ఒక సంకేతం.
ఎన్టీఆర్ విశేషత :
నందమూరి తారక రామారావు జన్మతహాస్ఫురధ్రూపి. దాదాపు 4 దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగంలో మకుటంలేని మహారాజులాగా భాసిల్లారు. పలు సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కథా నాయకుడిగా నటించి, సమకాలీన సామాజిక, రాజకీయ విలువలను, పురాణాల విశిష్టతను ప్రజల మనసుకు హత్తుకునేలా వివరించి ప్రజల ఆలోచనల్లో మార్పుకు కారణభూతులయ్యారు. రాముడిగానో, కృష్ణు డిగానో, ఎన్టీఆర్ చిత్రపటం లేని ఇల్లు తెలుగునాట ఉండదు. తెలుగు భాషపై ఆయనకున్న పట్టు, అనర్గళ వాక్చాతుర్యం ఎన్టీఆర్ కు ఉన్న అదనపు ఆకర్షణలు.
నాటి రాజకీయ నేపథ్యం :
ఆ రోజుల్లో అప్పటి ప్రభుత్వాలు ప్రజలకు అందిం చిన పాలన, రాజకీయ విలువలు, తెలుగుజాతికి దీర్ఘకాలంగా ఎదురవుతున్న అవమానాలు, తిండి.. గుడ్డ..గూడు సామాన్యునికి అందని దుర్భరపరిస్థితులు రాష్ట్రప్రజల మనసుల్లో నైరాశ్యాన్ని, నిరసనను కలిగిం చాయి. ఈ స్థితిని మార్చడానికి రాజకీయ ఆరంగేట్రం చేసిన ఎన్టీఆర్ ఆ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ పరిష్కారాలు చూపిన విధానం అప్పటి ప్రభంజనానికి ఎంతగానో తోడ్పడ్డాయి. పలు రకాలుగా కరిస్మాటిక్ లీడరైన ఎన్టీఆర్ నాడు సృష్టించిన ప్రభంజనం మరోసారి పునరావృత మవటం దుర్లభం అనుకొన్నారు.
నేటి ప్రభంజనం:
అక్టోబర్ 31 తెలుగురాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన రోజు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమంగా రాజమహేంద్రవరం కేంద్ర కారా గారంలో 52 రోజుల నిర్బంధం అనంతరం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదలై స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు. ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం 40 ఏళ్ల తర్వాత పున రావృతమైన రోజు. ఈ ప్రభంజనానికి కారణం నారా చంద్రబాబు నాయుడు.
భాషా పరంగా.. ఆకర్షణీయత పరంగా.. ప్రసంగ పాటవ పరంగా… గత కీర్తి పరంగా.. ఎన్టీఆర్‌కు చంద్రబాబు సరితూగరు. అయినా.. మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలై విజయవాడ సమీపంలోని ఉండవల్లిలో తమ నివాసగృహానికి చేరేదాకా సాగిన ఆయన రోడ్డు ప్రయాణం ఆసాంతం ఒక నూతన ప్రజా ప్రభంజనాన్ని ఆవిష్కరింపచేసింది.
రెండున్నర గంటలపాటు మాత్రమే సాగవలసిన చంద్రబాబు రోడ్డు ప్రయాణం 14 గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఆయన బెయిల్ పై విడుదల కానున్నారన్న వార్త వెలువడిన అనతికాలంలోనే వేలాదిమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు జైలు వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జైలు పరిసర ప్రాంతమంతా జనసందోహంగా మారింది. చంద్రబాబు నడుచుకుం టూ జైలు నుంచి బయటకు కాలిడగానే అక్కడి వాతా వరణమంతా ఉద్వేగభరితమైంది. 52 రోజుల తర్వాత జైలు గది నుంచి జనహృదయాల్లోకి వస్తున్న చంద్ర బాబుని చూసి ఆ మధురక్షణాల కోసం ఎదురుచూసిన వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్వయంగా కలిసి ఆత్మీయ కరచాలనంతో ఆలింగనం చేసుకోవాలనుకున్నారు. అయితే.. అక్కడి పరిస్థితుల దృష్ట్యా, అందరికీ ఆ అవకాశం దక్కలేదు. జైలు గేటు దాటి బయటకు వచ్చిన చంద్రబాబు తనకు స్వాగతం పలకడానికి వచ్చిన అశేష ప్రజానీకాన్ని చూసి కొద్ది క్షణాల పాటు భావోద్వేగానికి గురయ్యారు.
దారిపొడవునా జన నీరాజనం:
మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని కలిసి, క్లుప్తంగా ప్రసం గించి ఉండవల్లికి బయలుదేరగా రాజమహేంద్రవరం నగరం దాటడానికే 2 గంటలకు పైగా సమయం పట్టింది. నగరవాసులంతా దారిపొడవునా జై చంద్ర న్నా.. లాంగ్ లివ్ చంద్రన్నా.. మేము మీతోనే చంద్రన్నా అంటూ నినదిస్తూ, పూలు చల్లుతూ హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తూ ఉద్వేగంతో తమ సంఫీుభావాన్ని తెలియచేశారు. ఇదే ఆత్మీయత, ఉద్విగ్నత, ఉత్తేజం దారి పొడవునా పెల్లుబికాయి. చంద్రబాబు పయనిస్తు న్న జాతీయ రహదారిపై ఎడతెరిపి లేకుండా ఉప్పెనలా ఉప్పొంగిన జనాభిమానం, ఆనాటి ఎన్టీఆర్ ప్రభంజనా న్ని తలపింపచేసింది. దారి పొడవునా… మంగళవారం రాత్రంతా ప్రజలు చంద్రబాబు రాకకోసం పలుచోట్ల ఎదురుచూస్తూ తమ సంఫీుభావాన్ని తెలియచేశారు. ప్రతి చోటా వేలాదిమంది.. ముఖ్యంగా మహిళలు 52 రోజుల తర్వాత జనబాహుళ్యంలోకి వచ్చిన చంద్ర బాబుని చూడాలని ఆత్రుతతో వేచి ఉన్నారు.
ఇంటికి చేరడానికి 14 గంటలు:
ఇటీవలి కాలంలో తన వాడి, వేడి ప్రసంగాలతో చంద్రబాబు ప్రజలను ఆకర్షించడాన్ని అందరూ గమ నించారు. ఆయన సభలకు, రోడ్ షోలకు జనం భారీ సంఖ్యలో హాజరు కావడం సర్వత్రా గమనించారు. అయితే.. మంగళవారం సాయంత్రం నుండి బుధవా రం ఉదయం వరకు సాగిన చంద్రబాబు రోడ్డు ప్రయా ణం సందర్భంగా వెల్లువెత్తిన ప్రజా ప్రభంజనం ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కలికితురాయి అని పలువురు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఈ ప్రజా ప్రభంజనం నడుమ చంద్రబాబు ఉండవల్లిలోని స్వగృహానికి బుధవారం ఉదయం 6 గంటలకు చేరుకు న్నారు. అంటే.. 14గంటల సుదీర్ఘ ప్రయాణం. ఈ పరి ణామం నవ్యాంధ్ర రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి కారణభూతమవుతుందని పలువురి విశ్వాసం.
నాటి ప్రభంజనం ఎలా పునరావృతమైంది? :
స్వర్గీయ ఎన్టీఆర్ తో పలు విషయాల్లో సారూప్యత లేకపోయినా, తన విశిష్టతలతో చంద్రబాబు కూడా ఒక కరిస్మాటిక్ లీడర్‌గా రూపొందారని సామాజిక, రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు దార్శనికతతో రూపొందించి అమలుచేసిన పాలసీలు, పథకాలు, ఆయన చేసిన నిరంతర శ్రమ, పలురంగాల్లో సాధించిన సత్ఫలితాలు, ఆయన వ్యక్తిగత నడవడిక, విలువలు, సుపరిపాలన అందించడం కోసం ఆయన పడిన ఆరాటం, రైతాంగం, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల అభ్యున్నతి కోసం ఆయన చూపిన తాపత్రయం, ప్రపంచస్థాయి రాజధాని అమరావతికోసం ఆయన చేసిన కృషి, దేశవిదేశాల్లో ఆయనకున్న గౌరవ ప్రతిష్టలు, సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజాశ్రేయస్సు కొరకు ఉపయోగించుకున్న వైనం చంద్రబాబుని ఒక బ్రాండ్ గా రూపొందించాయని.. తత్ఫలితంగా ప్రజల్లో ఆయనకు విశ్వాసంతో కూడిన ఒక సుస్థిర స్థానం దక్కిందని పరిశీలకుల విశ్లేషణ.
రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితుల నేపథ్యంలో.. చంద్రబాబుని ఎలాగైనా దీర్ఘకాలం జైల్లో ఉండేలా చేయడం కోసం పాలకులు పన్నిన కుట్రకు వ్యతిరేకంగా ప్రజల్లో గూడుకట్టిన ఆగ్రహం, వ్యతిరేకత, చంద్రబాబు పట్ల ఉన్న సదభిప్రాయం ఆయన జైలు నుంచి విడుదలైన సందర్భంగా నిర్భీతితో బహిరంగంగా వ్యక్తమై జనప్రభంజనంగా మారిందని పరిశీలకుల అభిప్రాయం.
ఈ ప్రభంజనం దేనికి సంకేతం? :
ఈ ప్రభంజనం చంద్రబాబు కాన్వాయ్ ను జాతీయ రహదారిపై దాదాపు 25 ప్రధాన కూడళ్లలో ఆగిపోయే పరిస్థితులు కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా సాగిన చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణం సందర్భంగా దారిపొడవునా వెల్లివిరిసిన ప్రజాభిమానం, తదనంతర పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచక, అవినీతి, అసమర్థ, విధ్వంసకర, విద్వేషపూరిత పాలనకు వ్యతిరేకంగా ప్రజల మనస్సుల్లో నిక్షిప్తమై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ఈ ప్రభంజనం అద్దం పట్టిందని.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారం చూపి, జగన్ రెడ్డి నిర్వాకాల వలన కునారిల్లుతున్న నవ్యాంధ్ర పునర్నిర్మాణం కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజల మనసుల్లో బలంగా పాతుకుపోయిన దృఢమైన అభిప్రాయానికి సాక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబు సృష్టించిన 14గంటల ప్రభంజనం త్వరలో జరగనున్న ఎన్నికల తీర్పుకు స్పష్టమైన ముందస్తు సంకేతమని పరిశీలకుల మనోగతం. ఈ ప్రభంజనంతో వార్ వన్ సైడ్ అని నిర్ధారణ అయ్యిందని… చంద్రబాబుతోనే ప్రజలు ఉంటారని స్పష్టమైందని వారి లోతైన విశ్లేషణ.