- ప్రభుత్వ ప్రతి నిర్ణయమూ పేదల అభ్యున్నతికే
- సేవతో తృప్తి… సాయంతో మరింత సంతృప్తి
- సాయంతో పాటు… భరోసానూ మార్గదర్శులివ్వాలి
- చేయూతను బంగారు కుటుంబాలు సద్వినియోగం చేయాలి
- టీడీపీలోనే.. ఆడబిడ్డలకు అందలం
- ప్రజారోగ్య పరిరక్షణకు సంజీవని పేరిట పథకం
- నేనూ మార్గదర్శినే…దత్తత కుటుంబాలకు సమయం కేటాయిస్తా
- పీ`4 అమలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం
- అడాప్ట్ ట్రీని కుప్పంలోని బంగారు కుటుంబానికి అందించిన సీఎం
- సాయంచేసి జీవితాలు బాగు చేస్తున్నారంటూ బంగారు కుటుంబాల భావోద్వేగం
అమరావతి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం ప్రతి నిర్ణయమూ పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ`4 కార్యక్రమం అమలును మంగళవారం సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ ఏడాది ఉగాదిన పీ`4 కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అప్పటి నుంచి బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13,40,697 బంగారు కుటుంబాలను 1,41,977 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘పేదరిక నిర్మూలన ఎన్టీఆర్ సిద్దాంతం. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని భావించే సిద్దాంతాన్ని బలంగా నమ్మి పరిపాలన చేస్తున్నాం. అందుకే ప్రతినిత్యం పేదల కోసమే ఆలోచన చేస్తున్నాం. పేదల అభ్యున్నతికే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆర్థిక సంస్కరణలతో సంపద వచ్చింది. ఇప్పుడు సమాజంలో అసమానతలు తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకే పీ`4ను ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా 1.69 కోట్ల కుటుంబాలున్నాయి. సాయం కోరే పేద కుటుంబాలు 21 లక్షలున్నాయి. మార్గదర్శుల ఎంపికలో ఎలాంటి బలవంతం లేకుండా.. పూర్తి స్వచ్ఛంధంగానే కార్యక్రమాన్ని చేపడతున్నాం. సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇటీవలే ఓ అజ్ఞాత భక్తుడు తాను స్థాపించిన కంపెనీ ద్వారా వచ్చిన సంపాదన నుంచి రూ.140 కోట్ల విలువైన 121 కేజీల బంగారాన్ని తిరుమల వెంకన్నకు ఇచ్చారు. ఇంత భారీఎత్తున విరాళం ఇచ్చినా.. తన పేరు బయటకు తీసుకురావద్దని కోరారు. ఇలా కొంతమంది తమకు తోచిన రీతిలో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. రాని తృప్తి, సంతృప్తి పేదలకు సేవ చేసినా, సాయం చేసినా కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
చెప్పడమే కాదు… చేసి చూపిస్తున్నాను…
‘‘నేను కూడా మార్గదర్శినే. కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా ఎంత బిజీగా ఉన్నా… దత్తత తీసుకున్న కుటుంబాలకు సమయం కేటాయిస్తా. మార్గదర్శులు ఇచ్చే చేయూతను బంగారు కుటుంబాలు అందిపుచ్చుకోవాలి. అభివృద్ధి చెందాలి. సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సమాజం ఇచ్చిన సహకారంతో ఎదిగిన వారు సమాజానికి తిరిగివ్వాలని మార్గదర్శులు కూడా ఆలోచించాలి. మార్గదర్శులు డబ్బులిచ్చి సాయం చేయడంతో సరిపెట్టకుండా… బంగారు కుటుంబాలకు భరోసాగా ఉండాలి. భూమి మీద ఎవరూ శాశ్వతం కాదు. వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లలేరు. మానవత్వం ఉన్న మనుషులుగా బతకాలి. చనిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తు పెట్టుకునే పనులు చేయాలి. డొక్కా సీతమ్మ అంటే పేదల పెన్నిధి. అన్నదాతగా ఇప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోయారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. అందుకే సమాజం కోసం పని చేయాలని కోరుతున్నాను. పీ`4 అమలు విషయంలో ఇకపై ప్రతి రోజూ మానిటరింగ్ ఉంటుంది. మూడు నెలలకోసారి సమీక్ష ఉంటుంది’’ అని సీఎం స్పష్టం చేశారు.
ఆదాయం ఉండాలి… సేవ చేయాలనే తపన ఉండాలి
‘‘పేదలకు సేవ చేయాలన్నా… సంక్షేమం అందించాలన్నా… సంపద సృష్టించాలి. ఆదాయాన్ని తీసుకురావాలి. పేదలకు మేలు చేయాలనే మనస్సుండాలి. అప్పుడే సంక్షేమం అందివ్వగలం. ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా పెద్దఎత్తున సంక్షేమం అమలు చేస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమం అందిస్తున్నాం. సంపద సృష్టికి కృషి చేస్తున్నాం. సంపద సృష్టించి.. ఆ సంపదను పేదలకు ఇచ్చే ప్రభుత్వం మాది. ఈ నెలలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ప్రతి నెలా ఇచ్చే పెన్షన్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశాం. తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే అమలు చేశాం. ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం అమలు చేశాం. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెచ్చాం. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చేలా చేశాం. ఆడబిడ్డలతో సహా ప్రతి ఒక్కరూ ఏదోక పని చేయాలి. ఉద్యోగం, ఉపాధి పొందాలి. ఉపాధి నిమిత్తం వెళ్లే ఆడబిడ్డలకు స్త్రీశక్తి పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ధరలు పెరిగాయని మళ్లీ కొందరు కట్టెల పొయ్యి వాడారు. అందుకే మహిళల కోసం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇలాంటి ఎన్నో పథకాలు పేదలకు అందించాలంటే దూరదృష్టి కావాలి. అందుకే స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపొందించాం. విజన్ 2020 రూపొందిస్తే ఆనాడు అందరూ విమర్శించారు. కానీ ఆనాడు నేను చెప్పిన దానికంటే.. తెలంగాణ, హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు విజన్ 2047 రూపొందించాం. 2047 పెద్ద దూరం లేదు. 22 ఏళ్లు మాత్రమే ఉంది. ఈ ప్రణాళికలు నిజం కావాలంటే… ప్రభుత్వాల్లో కంటిన్యూటి ఉండాలి. ప్రస్తుతం హెచ్‌సీఎల్ వంటి సంస్థ గన్నవరంలో 5 వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. 2019లో ప్రభుత్వం కొనసాగిఉంటే… మరింత మందికి ఉద్యోగాలు ఇచ్చేది. ఉపాధి చూపించేది. అందుకే అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ప్రజారోగ్య పరిరక్షణకు సంజీవని
‘‘ఆరోగ్యం కోసం బెస్ట్ విధానం తీసుకురాబోతున్నాం. బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రజారోగ్య పరిరక్షణ చేపడతాం. సంజీవని పేరుతో ప్రజారోగ్య పరిరరక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సంజీవని తెస్తున్నాం. ఇప్పటికే కుప్పంలో బిల్‌గేట్స్ ఫౌండేషనుతో డీజీ నెర్వ్ సెంటర్ ఏర్పాటు చేశాం. త్వరలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా అమలు చేస్తాం. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెస్తాం. పేద ప్రజల కోసం.. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో విదేశాల్లో ఉన్న వారితో జూమ్ ద్వారా చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు పలువురు సౌదీ ఆరేబియాకు చెందిన తెలుగువారు ముందుకు వచ్చారు. వారితో నిర్వహించిన ముఖాముఖి సందర్భంగా పలువురు బంగారు కుటుంబాలకు చెందిన ప్రతినిధులు భావోద్వేగానికి గురయ్యారు. పీ4 ద్వారా హెచ్‌సీఎల్ కంపెనీలో ఉద్యోగం కల్పించటంతో కృష్ణా జిల్లావాసి పావని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అలాగే కుప్పంలో తాను దత్తత తీసుకున్నదానికి సంకేతంగా అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలకు ముఖ్యమంత్రి అందించారు. ఈ కార్యక్రమంలో పీ`4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఎన్నార్టీ ఛైర్మన్ వేమూరి రవికుమార్, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.