- న్యాయం కోసం స్టేషన్‌కు వెళితే మాపైనే అక్రమ కేసులు
- విడదల రజనీ, లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పనిచేసే వారే కారకులు
- వైసీపీ నేతల అనుచరులమని చెప్పుకుంటూ బెదిరిస్తున్నారు
- ప్రజావినతుల కార్యక్రమంలో చంద్రబాబుకు ఓ తల్లి గోడు
- ఎంతటి వారున్నా వదిలేది లేదు..న్యాయం చేస్తామని సీఎం హామీ
- తానేటి వనిత అండతో భూమి కబ్జా చేశారని మరో ఫిర్యాదు
- పొలంలోకి పోనివ్వకుండా వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన
మంగళగిరి(చైతన్యరథం): మానవ మృగాలకు కొమ్ముకాసి.. నేరస్తులకు రక్షణ కల్పించిన గత వైసీపీ ప్రభుత్వంలో దుర్మార్గపు చర్యలు అనేకం బయటపడుతున్నాయి. న్యాయం చేయాలని అడిగిన బాధితులనే హింసిస్తూ గత ప్రభుత్వంలో పోలీసులు కేసులు పెట్టి వేధించిన ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడు వెళ్లబోసుకు న్నారు. తన కుమార్తె హత్య కేసులో న్యాయం చేయాలని ఓ మహిళ, పొలంలోకి దిగితే వైసీపీ నేతలు చంపేస్తామని బెదిరి స్తున్నారని ఓ బాధితుడు, గత ప్రభుత్వంలో అకారణంగా పింఛన్లు తొలగించారని విభిన్న ప్రతిభావంతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడే వారికి సీఎం ఆర్థికసాయం చేశారు.
చిత్రహింసలు పెట్టి నా కుమార్తెను చంపేశారు
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన కుమార్తె 2022 జూలై 4న కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.. అదే కాలనీలో ఉంటున్న ఆటోడ్రైవర్ ఆనంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వంచించి తీసుకెళ్లాడు… 14 నెలల పాటు తన కుమార్తెను చిత్రహింసలు పెట్టి బండారు ఆనంద్, అతని సోదరులు అరవింద్, అజిత్ వారి మేనమామ తిరుపతిరావు, అత్త అంకలక్ష్మి తన కుమార్తెను శవంగా పంపించారని గుంటూరు జిల్లా గుజ్జనగుళ్లకు చెందిన నిశ్శంకర శంకరలీల అనే మహిళ సీఎం ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె హత్యపై రెండేళ్లుగా పోరాడుతుంటే మాపైనే హత్యాయత్నం కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కేసులో రెండేళ్లుగా తిరుగుతున్నామని.. వైసీపీ నేతలు విడదల రజనీ, లేళ్ల అప్పిరెడ్డి దగ్గర పనిచేస్తామని చెబుతూ బెదిరించారన్నారు. చేతికి అందివచ్చిన కుమార్తెను పోగొట్టుకున్నదే కాక అక్రమంగా పెట్టిన కేసులో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని మొరపెట్టుకున్నారు. న్యాయం చేయాలని నాటి నల్లపాడు సీఐని కోరగా అసభ్య పదజాలంతో దూషించారని వివరించింది. తన కుమార్తెను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు వేడుకున్నారు. శంకరలీల బాధను విన్న సీఎం ఆమెను ఓదార్చారు. కేసులో ఎంతటి వాళ్లున్నా వదిలిపెట్టమని తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
వైసీపీ నేతలు చంపేస్తామని బెదిరిస్తున్నారు
పొలంలోకి అడుగుపెడితే చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటకు చెందిన బొప్పన సురేష్‌బాబు సీఎంకు ఫిర్యాదు చేశారు. 2021లో చాగళ్లు పరిధిలోని దారవరం, మార్కొండపాడు, బ్రాహ్మణగూడెంలో 17 ఎకరాలు పొలం కొనుగోలు చేశాం..7.57 రిజిస్ట్రేషన్ కాగా మిగతాది అగ్రిమెంట్ రాయిం చుకున్నాం..కానీ వైసీపీ నేతలు ఆ పొలంలోకి రానివ్వకుండా అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత ప్రోద్బలంతో కేసులు పెట్టి వేధించారు..నా పొలం నాకు దక్కేలా న్యాయం చేయాలని విన్నవించారు.
సీఎం ఎదుట జవాన్ దంపతుల కంటతడి
జగన్ ప్రభుత్వంలో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన అక్కల రోజా, ఆమె భర్త జవాన్ జ్ఞానానంద్ సీఎం చంద్రబాబు దగ్గర కంటతడి పెట్టుకున్నారు. బిల్డింగ్ 3వ అంతస్తుకు అనుమతి ఇవ్వకుండా ఐదేళ్ల పాటు తిప్పి ఇబ్బందులకు గురి చేశారని జవాన్ దంపతులు మొరపెట్టుకున్నారు. కృష్ణ అనే వ్యక్తి ఇల్లు కొనుగోలు చేసి రూ.10 లక్షల మేర ఇవ్వకుండా బెదిరించడంతో అప్పులపాలై రోడ్డునపడ్డామని వివరించారు. సమస్యను పరిష్కరిస్తా మని వారికి సీఎం హామీ ఇచ్చారు.