- అనేక రంగాల్లో పెట్టుబడులకు అనువైన ప్రాంతం ఏపీ
- గ్రీన్ ఎనర్జీరంగంలో ముందున్నాం…
- షిప్‌బిల్డింగ్ యూనిట్లకు ప్రాధాన్యమిస్తున్నాం
- ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు
విశాఖపట్నం (చైతన్య రథం): రాబోయే కాలంలో ఏయే రంగాలకు ప్రాధాన్యత ఉంటుందో గుర్తించి.. ఆయా రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతంగా ఉంటుందని వెల్లడిరచారు. గురువారం విశాఖలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆర్మేనియా ఆర్థిక వ్యవహరాల మంత్రి గివార్గ్ పొపాయాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు, భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కళ్యాణి సహా వివిధ కంపెనీలకు చెందిన ఛైర్మన్లు, సీఈఓలు, సీఐఐ ప్రతినిధులు హజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంతోపాటు.. ఇంటరాక్షన్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి వివిధ అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…‘‘విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోంది. సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోంది. గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించాం. గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలుగా భారతీయులే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక సంస్కరణల తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాం. కేంద్రం ప్రారంభించిన భారత్ క్వాంటం మిషన్ నుంచి అవకాశాలను అందిపుచ్చుకున్నాం… దేశంలో తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం. అలాగే డ్రోన్ల వినియోగం… వివిధ రంగాల్లో పని చేసే వారికి… అలాగే డిఫెన్సు రంగంలో ఉన్న వారికి ఉపయోగపడాలి. వీటి తయారీ పెరగాలి. అందుకే ఏపీని డ్రోన్ తయారీకి కేంద్రంగా చేయాలని భావిస్తున్నాం. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం.’’అని ముఖ్యమంత్రి వివరించారు.
పోర్టులే మా బలం
‘‘ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా పెరిగింది. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో ఏపీ బలంగా ఉంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భూతాపం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ లాంటి ప్రకృతి విపత్తులతో నగరాలు నీట మునిగే పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. 40 సెంటిమీటర్ల వర్షపాతం ఒకే చోట పడుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్లే ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. అందుకే మనం అంతా కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు ముందడుగు వేయాలి. ప్రస్తుతం సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారవుతుంది. ఏపీకి వస్తున్న డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీని సరఫరా చేస్తాం. మనం అంతా కలిసి మానవాళి సంక్షేమానికి పనిచేద్దాం. అలాగే పోర్టు రవాణా రంగంలో ఏపీలో అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పోర్టులను నిర్మిస్తున్నాం. పోర్టులను వివిధ నెట్వర్క్ లకు అనుసంధానిస్తున్నాం. రైల్వే, ఎయిర్ పోర్టులతో పాటు.. దేశాల్లోని వివిధ ప్రధాన నగరాలకు ఏపీలోని పోర్టులతో అనుసంధానించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రస్తుతం భారత్ దేశం నౌకా నిర్మాణంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం. నౌకా నిర్మాణ రంగంలో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలి కోరుతున్నాం.’’అని సీఎం చెప్పారు.
ఎస్కార్ట్ ఆఫీసర్లను పెడతాం… పారిశ్రామిక వేత్తలకు ఇబ్బంది లేకుండా చూస్తాం
‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నాం. కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. గూగుల్ కూడా రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతోంది. వారికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చాం. ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదు. పెట్టుబడులతో ముందుకు వస్తే చాలు ఎస్కార్ట్ ఆఫీసర్‌ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తాం. ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుంది. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల రంగంలోనూ కీలకంగా పని చేస్తున్నాం. ప్రకృతి సేద్యంలో పండిరచిన అరకు కాఫీ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ గా మారింది. ఏపీలో ఉన్న అవకాశాలను పరిశీలించి… ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని యూరోప్ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నాను. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా మారుతుంది, అందులో ఏపీ ముందుంటుంది.’’అని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.















