- బాధిత విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
- ఆత్మహత్యకు కారకులపై చట్ట ప్రకారం చర్యలు
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్‌గా ఉన్న నాగాంజలి తన సూసైడ్ నోట్‌లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం డా.దువ్వాడ దీపక్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. విద్యార్థినులు, యువతుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇటువంటి ఘటనలు చోటు చేసుకొన్నప్పుడు పోలీసుశాఖ కూడా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టడంతోపాటు బాధిత వర్గం ఆవేదనను, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలి. తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థులు ఆందోళనకు లోనవుతారు. కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యాచార, హత్య ఘటన సమయంలో మెడికోలు ఆందోళనలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. విద్యార్థులకు, యువతులకు భరోసా, ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలి. రాజమండ్రి ఘటన నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి హోమ్ శాఖ మంత్రి అనిత, రాష్ట్ర డీజీపీతో చర్చిస్తానని పవన్ తెలిపారు.