- కలెక్టర్లకు సీఎం స్వేచ్ఛనిచ్చారు
- సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా మార్చాలి
- వివాదరహిత భూములను 22ఏ జాబితానుంచి తొలగించేలా చర్యలు
- త్వరలో సుమోటోగా పాస్ పుస్తకాలు
- కలెక్టర్లకు ప్రయివేట్ భూముల తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం
- కేటాయించిన భూముల్లో పరిశ్రమలు పెట్టేలా చూసే బాధ్యత కలెక్టర్లదే
- పకడ్బందీగా పీజీఆర్‌ఎస్ అమలు…క్రమం తప్పకుండా ఆడిట్
- కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి (చైతన్యరథం): జిల్లా కలెక్టర్లందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, దీన్ని కలెక్టర్లు సద్వినియోగం చేసుకుని జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడానికి దోహదపడాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో తొలిరోజు సోమవారం ఆయన ప్రారంభోపన్యాసం చేస్తు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంలే ఈ కూటమి ప్రభుత్వం కలకాలం ఉండాలని, ఈ విజన్ కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చేందుకు కలెక్టర్ల సహకారం ఎంతో అవసరమన్నారు. భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చామని తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు. దీనిపై మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసి ఓ తుదినిర్ణయానికి వస్తామన్నారు. వివాదరహిత 22ఏ భూములను పరిశీలించి ఆ భూములను ఆ జాబితా నుంచి తొలగించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే పగడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
విప్లవాత్మక సంస్కరణలు
ప్రయివేట్ భూములను తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారం కలెక్టర్లుకు అప్పగిస్తూ చట్టంలో మార్పులు చేశామని, దీనిపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్త్తి చేసి పత్రాలు అందజేలా విప్లవాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేని భూముల్లో పేదలకు పట్టాలు ఇచ్చేలా జీఓ నెంబరు 30 తీసుకొచ్చామన్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వివిధ కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయిస్తున్నామని, ఆ కంపెనీలు ఆ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పేలా చూసి, స్థానిక యువతకు ఉపాధి కల్గించేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ల పైనే ఉంటుందన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. తమ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పినా సూపర్ 12 కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఈ 15 నెలల్లో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అమలు చేస్తూ మంచి ప్రభుత్వం అనిపించుకున్నామని, పేదరికాన్ని తరమికొట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్దే కూటమి ప్రభుత్వ అజెండా అన్నారు. విజన్` 2047 సాధన కోసం కలెక్టర్లు కృషి చేయాలన్నారు. పేదరిక నిర్మూలన కోసం పీ4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని.. దీన్ని విజయవంతం చేయాలన్నారు. గత పాలకుల వల్ల రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కుడా రద్దు చేశామన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను పటిష్టంగా క్రమబద్ధీకరణ చేశామని చెప్పారు.
అన్ని రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నామన్నారు. రెవెన్యూ అప్పీళ్ళ సత్వర పరిష్కారానికి ఇ-కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. అర్బన్ ల్యాండ్స్‌కు కూడా ఆటోమ్యుటేషన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నామని, దీన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. భూవివాదాలకు చెందిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటిని క్రమంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్ల్లో భూ వివాదాలకు చెందినవే అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేలా పనిచేస్తున్నామని, దీనికోసం ఆడిట్ కూడా చేస్తున్నామన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు , భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశాం, రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వెంటనే సూమోటోగా పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీని ద్వారా భూయజమానులు, రైతులు పాస్ పుస్తకాల కోసం అధికారుల చుట్టూ తిరిగే పని తప్పుతుందన్నారు. రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్తగా ఉచితంగా 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నాయని, వీటిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేస్తామని చెప్పారు. ఎటువంటి తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే బాధ్యత తమ ప్రభుత్వానిదని, రైతులెవ్వరూ కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు.
మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు
నేపాల్ లో చిక్కుకున్న తెలుగవారిని సురక్షితంగా వారి స్వస్థలాలకు విజయవంతంగా రప్పించేలా చర్యలు తీసుకున్న మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి అనగాని కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారిని సుక్షితంగా స్వస్థలాలకు రప్పించడంలో మంత్రి లోకేష్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ సవాళ్ళను అధికమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి జరుగుతోందన్నారు. పరిశ్రమలు, ఇంధన రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని తెలిపారు. పీజీఆర్‌ఎస్ విధానం ద్వారా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని 90 శాతానికి పైగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధికి, అందరికీ సామాజిక న్యాయం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకు ముందు సీసీిఎల్‌ఏ జయలక్ష్మి సమావేశానికి స్వాగతం పలికారు.