- ఆర్థిక ఇబ్బందులున్నా హామీలన్నీ అమలు
- మున్సిపల్ మంత్రి నారాయణ
- పెడనలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం
- పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ
పెడన (చైతన్యరథం): సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణతో కలిసి సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయింది. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టాం. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. 2014-19 మధ్య లో కేంద్రం నుంచి ఏఐఐబీ, అమృత్ నిధులు ఇచ్చేలా ఒప్పించాం. కేంద్రం వాటా విడుదల చేసినా…గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆ నిధులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేలా ముందుకెళ్తున్నాం. పెడనలో వచ్చే రెండేళ్లలో అందరికీ తాగునీరు అందించేలా 91.18 కోట్లతో పనులు చేపడుతున్నాం. పెడన మున్సిపాలిటీలో డ్రెయిన్ల నిర్మాణానికి రూ.2కోట్లు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండిరగ్ పనుల పూర్తికి రూ.25 లక్షలు విడుదల చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.