- సమయం దగ్గరపడుతున్నా పింఛన్ల పంపిణీపై నోరు మెదపని సీఎస్, సెర్ప్ సీఈఓ
- జగన్ భక్తితో రెండు నెలలు వృద్ధులను కష్టపెట్టిన సీఎస్
- పింఛన్ల కోసం ఎండల్లో తిరిగి మృత్యువాత పడిన అవ్వాతాతలు
- బ్యాంకుల చుట్టూ తిరగలేక పండుటాకుల ఇబ్బందులు
- సీఎస్‌కు భూములు కొట్టేయడంపై ఉన్న శ్రద్ధ, పింఛన్ల పంపిణీపై లేదు
- తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారు
అమరావతి(చైతన్యరథం): జూన్1న లబ్దిదారులకు ఇళ్లవద్దనే పింఛన్ పంపిణీ చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 1వ తేదీ దగ్గరకు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి ఇప్పటివరకు పించన్ల పంపిణీపై నోరుమెదపటం లేదన్నారు. అధికారులను మొద్దునిద్ర నుండి లేపి జూన్ 1నే ఇళ్లవద్దనే పింఛన్ ఇచ్చేలా చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు తమకు దిశానిర్దేశం చేశారని తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్నాటకంలో భాగంగా ఏప్రిల్, మే నెలల్లో సీఎస్ నడిపించిన మంత్రాంగం వల్ల పింఛన్ దారులు పడిన బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో జగన్ రెడ్డికి మేలు జరగాలనే కుట్రలో సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి కలిసి పింఛన్ దారులను అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగలేక మండుటెండల్లో పింఛన్ దారులు అల్లాడి పోయారు. వడదెబ్బతో పలువురు వృద్ధులు మృత్యువాత పడ్డారు. 60 మంది పింఛన్‌దారులు చనిపోయినట్లు సాక్షి పేపర్లోనే ప్రచురించారు. అధికార పార్టీకి లబ్ధి కలిగించేందుకు అమయాకులైన పింఛన్ దారులను సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పి వారి చావుకు కారణమయ్యారు. చేసిందంతా చేసి టీడీపీపై బురద చల్లేందుకు యత్నించారని దేవినేని మండిపడ్డారు.
తప్పులన్నీ సమీక్షిస్తాం
జూన్ 1 వస్తున్నా.. ఇప్పటికీ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం నుండి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఎన్నికలు ముగిసాయి. ఇకనైనా సీఎస్ కుట్రలు ఆపాలి. ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన పింఛన్ డబ్బులు ఎంతమంది తీసుకున్నారు.. ఎంత మంది తీసుకోలేదు.. అన్ని వివరాలను బయట పెట్టాలి. చాలా మంది పింఛన్‌దారుల బ్యాంక్ అకౌంట్‌లు పనిచేయక వేసిన డబ్బులు వెనక్కి వెళ్లాయి. మరికొంతమంది పింఛన్‌దారుల డబ్బులు వివిధ కారణాలతో బ్యాంకులు కోతపెట్టి జమచేసుకున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని వాడుకుని ఒకటి, రెండు రోజుల్లోనే ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వొచ్చు. మళ్లీ ఇలా జరగకుండా గత రెండు నెలల తప్పిదాలు మళ్లీ జరగకుండా, సీఎస్ స్వామి భక్తి కట్టి పెట్టి లబ్దిదారుల ఇంటి దగ్గరే పింఛన్ ఇచ్చేలా అధికారులను ఆదేశించాలి. పింఛన్ల పంపిణీపై ఇంతరవరకు కలెక్టర్లతో సీఎస్ మాట్లడలేదు. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ రెడ్డితో పాటు సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నారు. దీంతో ఆయన కూడా స్వామి భక్తి చూపిస్తూ.. ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశారు. అధికారుల తప్పులన్నీ సమీక్షిస్తాం. తప్పు చేసిన అధికారులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. సీఎస్ వెంటనే అధికారులను ఆదేశించి జూన్ 1నే లబ్దిదారులకు ఇళ్లవద్దనే పింఛన్ ఇచ్చేలా చూడాలని దేవినేని డిమాండ్ చేశారు.
కలెక్టర్లు చెప్పినా..
మార్చి చివరి వారంలో దాదాపు రూ.13000 వేల కోట్లు జగన్ తాబేదారులైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఏప్రిల్‌లో పింఛన్ దారులను ఇబ్బంది పెట్టారు. ఏప్రిల్‌లో మరో రూ.3000 కోట్లు కంట్రాక్టర్లకు దోచిపెట్టి మళ్లీ మే నెలలోనూ పింఛన్‌దారులను కష్టపెట్టారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వడానికి సరిపడా యంత్రాంగం ఉందని కలెక్టర్లు చెప్పినా జగన్ రెడ్డికి మేలు చేయడానికి సీఎస్, సెర్ప్ సీఈఓలు కలిసి పింఛన్‌దారులను ఇబ్బంది పెట్టారు. జగన్ అసమర్థ పాలనలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలను నిలిపేస్తే… టీడీపీ నేతలు నిలదీశాక సీఎస్ కళ్లు తెరిచి ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యాజమాన్యాల కాళ్లు పట్టుకుని సేవలు కొనసాగేలా చూశారని దేవినేని దుయ్యబట్టారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
పేదల భూములు దోచుకోవడంలో సీఎస్ బీజీగా ఉన్నారు తప్పా.. పేదల పింఛన్ల పంణీపై కాదని అర్థమవుతోంది. విశాఖ సమీపంలో భోగాపురంలో పేదల భూములు కొట్టేసేందుకు జవహర్ రెడ్డి, జగన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు యత్నిస్తున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే భూములు కాజేసేందుకు కుట్రపన్నినట్లు వస్తున్న వార్తలపై సీఎస్ స్పందించాలి. అక్కడ జరిగిన భూ లావాదేవీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. దోచుకున్న భూములకు రిజిస్ట్రేషన్ పనులు వేగవంతం చేసేందుకే భోగాపురం విమానాశ్రయ పనుల సమీక్ష పేరుతో సీఎస్ అక్కడకి వెళ్లారని అక్కడి జనసేన కార్పొరేటర్ బట్టబయలు చేస్తే అతనికి నోటీసులు ఇస్తామనడం సబబు కాదు. ఆరోపణలు వచ్చినప్పుడు తప్పుచేయలేదని నిరూపించుకుని వాస్తవాలు బయటపెట్టాలని దేవినేని హితవు పలికారు.