- పనులు పూర్తి కాకుండానే సంగం బ్యారేజీ ప్రారంభం
- నత్తనడకన జలవనరుల ప్రాజెక్టులు పనులు
అమరావతి: సంగం బ్యారేజీకి చంద్రబాబు నాయుడు 82.86 శాతం పనులు చేయిస్తే, జగన్‌రెడ్డి మిగిలిన పనులను కూడా పూర్తి చేయకుండా ప్రారంభించారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతరుల కష్టానికి పేర్లు మార్చి రిబ్బన్ కటింగ్ చేయడానికి జగన్‌రెడ్డికి బుద్ధుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో జలవనరులశాఖ నిద్రావస్థలో ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పోవడంతో ప్రాజెక్టులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. 2008లో ప్రారంభమైన సంగం బ్యారెజ్ ప్రాజెక్ట్ 2014 వరకు ఒక్క అడుగు ముందుకు వేయని పరిస్థితి. 2015లో చంద్రబాబు ప్రాజెక్టులో మార్పులు, చేర్పులతో పనులు ముమ్మరం చేసి 82.86శాతం పూర్తయ్యేలా చేశారు. సంగం బ్యారేజ్‌కి సంబంధించి కేవలం 17.14 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మూడున్నరేళ్లల్లో 10 శాతం పనులు కూడా పూర్తి చేయకపోవడంతో అధిక వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట ముని గిపోయాయి. లక్షల మంది ప్రజలు వీధి పాలైనా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు.
సంగం బ్యారేజీ పూర్తితో పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువ కింద సాగులో ఉన్న దాదాపు 3.85లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. దాన్ని ఎందుకు మూడున్నరేళ్ళుగా పూర్తి చేయ లేదని ప్రశ్నించారు. బ్యారేజీ నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలమట్టం పెరిగి చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కా రం లభిస్తుందన్నారు.