- స్టార్టప్లో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ట్రం నిలవాలి
- నేడు కేబినెట్ ముందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ
- వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వెయ్యి సేవలు
- క్లస్టర్ వారీగా పరిశ్రమల స్థాపనపై దృష్టి
- ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై సమీక్షలో మంత్రి నారా లోకేష్
ఉండవల్లి (చైతన్యరథం): ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరసమైన చర్యలు చేపట్టాలని అధికా రులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖపై మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. స్టార్టప్ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలి.. మరో రెండు నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా సమావేశంలో చర్చించారు. శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్, ఇన్నోవేషన్ సొసైటీ, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ పైనా సమావేశంలో చర్చించారు.
పెట్టుబడుల ఆకర్షణకు ఆయా పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఆయా పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరపాలని ఈడీబీ సమావేశంలో మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఆయా పెట్టుబడుల ప్రస్థుత స్థితిపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో గూగుల్, సత్వా, టీసీఎస్, ఏఎన్ఎస్ఆర్ వంటి కంపెనీలు త్వరితగతిన తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్ వారీగా పరిశ్రమల స్థాపనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం. ఇందుకు టాప్- 100 డెవలపర్స్, ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, స్పెషల్ సెక్రటరీ బి. సుందర్, ఏపీటీఎస్ ఎండీ సూర్యతేజ, ఎస్.పి మల్లికా గార్గ్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ గీతాంజలి శర్మ, ఆర్టీఐహెచ్ సీఈవో పి.ధాత్రి రెడ్డి, ఆర్టీజీఎస్ అడిషనల్ సీఈవో సౌర్యమాన్ పటేల్, ఈడీబీ సీఈవో శశికాంత్ వర్మ, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, జీఎం విజయ్ కాంత్, తదితరులు పాల్గొన్నారు.