- మంత్రి కుటుంబంపైనా చర్యలు
తిరుపతి (చైతన్యరథం) : మదనపల్లె తహసీల్దార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాల గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు. శుక్రవారం తిరుపతిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. మంత్రి హోదాలో సొంత జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ భూములు కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. మంగంపేట అటవీ భూములు పెద్దిరెడ్డి దేనికి వాడుకుంటున్నారో అర్ధం కావడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. గెస్ట్‌హౌస్ కోసమా లేక ఎర్రచందనం అక్రమ రావాణా కోసమా అన్నది తేలాల్సి ఉందన్నారు. మంగళంపేట అటవీశాఖ భూ ఆక్రమణలపై రెండు వారాల వ్యవధిలో నివేదిక వస్తుందని తెలిపారు. అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబంపైనా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మదనపల్లె సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిందే వైసీపీ ప్రభుత్వం అని ఆరోపించారు. వైసీపీ చేసిన అప్పులను తమ ప్రభుత్వం కడుతుందని అన్నారు. ఫీజుల మీద ధర్నా చేయడానికి వైసీపీకి అర్హత ఉందా అని ప్రశ్నించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రజాస్వామ్యం ప్రకారం పద్ధతిగా సాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.