- పంచాయతీల నిధులను పక్కదారి పట్టించారు
- కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు ఆర్థికస్వేచ్ఛ
- రాజకీయాలకు అతీతంగా వైసీపీ సర్పంచ్‌ల గ్రామాలకూ నిధులు
- పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి (చైతన్యరథం): ఐదేళ్ల పాలనలో పంచాయితీరాజ్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలను పట్టణాలకు దీటుగా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం, వైదెన గ్రామంలో మంత్రి గొట్టిపాటి శుక్రవారం పర్యటించారు. వైదన గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించబోయే ముస్లిం కళ్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ.20 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలను గొట్టిపాటి ప్రారంభించారు. కొందరు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. శంకుస్థాపన చేసిన ముస్లిం కళ్యాణ మండపాన్ని నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన హాస్టళ్ల నిర్వహణ విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభించిందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతమాగలూరులో సుమారు 200 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహణ సరిగా లేకపోవడంతో పాముకాటు వలన ఒక విద్యార్థి మృతి చెందాడని గుర్తు చేశారు. అక్కడ రూ.50 లక్షలతో కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మించామని తెలిపారు. స్థానికంగా కూడా రూ.50 లక్షలతో మంచి హాస్టల్ భవనాన్ని ౖనిర్మిస్తామని చెప్పిన మంత్రి గొట్టిపాటి, ఆ హాస్టల్ లో విద్యార్థులను చేర్పించే బాధ్యత గ్రామస్తులు తీసుకోవాలని తెలిపారు.
జాతిపిత గాంధీజీ ఆశయాలకు వ్యతిరేకంగా….
దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ ఆశయాలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి విషయంలో నిరంకుశంగా వ్యవహరించిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి., గ్రామాల అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం గ్రామాలను బలోపేతం చేస్తోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వైసీపీ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకూ ఎలాంటి వివక్ష లేకుండా నిధులను విడుదల చేస్తున్నామని మంత్రి వెల్లడిరచారు. రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయితీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.998 కోట్ల నిధులు విడుదల చేసిందని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను గౌరవించే వ్యక్తి అని.., ఎన్నికల సమయంలోనే తాము రాజకీయం చేస్తామని., మిగిలిన సమయంలో రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచిస్తామని గొట్టిపాటి స్పష్టం చేశారు. సీఎంగా పదవి అనుభవించిన జగన్ భద్రత విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం సిగ్గు చేటన్నారు. చిత్తూరు జిల్లాలోనే చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి చేయించిన ఘన చరిత్ర జగన్‌కు ఉందని తెలిపారు. తాము అటువంటి నీతిమాలిన రాజకీయాలు చేయడం లేదని మంత్రి గొట్టిపాటి వెల్లడిరచారు. అటువంటి వాటికి కూటమి ప్రభుత్వం దూరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తాము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.