పల్లా చేతికి పగ్గాలు?
రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం
అమరావతి: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ (యాదవ) నాయకుడు పల్లా శ్రీనివాసరావు నియమితులు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ పై 95వేల 235 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు నిలిచారు. 2014 ఎన్నికల్లో సైతం గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అధిష్టానానికి విధేయుడిగా పేరున్న పల్లాకు ఈసారి కేబినెట్ లో చోటు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. అయితే వివిధ సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయినా కీలకమైన పార్టీ పగ్గాలను అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పల్లాను నియమిస్తే అచ్చెన్నాయుడు స్థానంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు మరో బీసీ నేతకు అప్పగించినట్లవుతుంది. తెలుగుదేశం పార్టీకి బలం, బలగం బీసీలే. గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షులుగా వ్యవహరించిన కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ప్రస్తుతం అధ్యక్షుడుగా నియమితులయ్యే అవకాశం ఉన్న పల్లా శ్రీనివాసరావులది బీసీ సామాజిక వర్గమే. అంతే కాకుండా వీరి ముగ్గురిది ఉత్తరాంధ్ర ప్రాంతమే కావడం గమనార్హం.