ప్రశాంత పాలనంటూ ప్రజల ఫీడ్‌బ్యాక్
సూపర్ సిక్స్ హామీలు 90శాతం అమలు
కార్యకర్తల పనితీరుపైనా రిపోర్టు అందింది
కష్టపడినవాళ్లకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడి
మంగళగిరి (చైతన్య రథం): టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు నిర్వహించిన ‘సుపారిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం దిగ్విజయంగా సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడిరచారు. టీడీపీ కేంద్ర కార్యాలయంనుంచి బుధవారం ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనపై 40 రోజులపాటు నిర్వహించిన కార్యక్రమంలో 1.08 లక్షలమంది కార్యకర్తల ద్వారా 1.2కోట్ల ఇళ్లకు చేరుకోగలిగామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ప్రజలు పొందిన లబ్ధిని వివరిస్తూ.. ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రశాంత పాలన సాగుతోందన్న సంతోషం ప్రజలనుంచి వ్యక్తమైందని అధ్యక్షుడు పల్లా వెల్లడిరచారు. టెక్నాలజీని వినియోగించి జియో ట్యాగింగ్ ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షించామన్నారు. దీనివల్ల కార్యకర్తల పనితీరును సమర్థవంతంగా అంచనా వేయగలిగామని, ప్రజలు గత ప్రభుత్వ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాలంటీర్ల అరాచకాలు, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన వంటి అంశాలూ తమ దృష్టికి వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారని, నిజమైన ప్రజాస్వామ్య పాలనలో ఉన్నట్టు ప్రజలు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారని పల్లా వెల్లడిరచారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో 70 శాతం ఇప్పటికే అమలు చేసిందని పల్లా స్పష్టం చేశారు. ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్న ‘స్త్రీశక్తి’తో.. ఇది 90 శాతానికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. పెన్షన్ రూ.1000 పెంచి ప్రతినెలా 1న పంపిణీ చేయడంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమంపై మాత్రమే దృష్టిపెట్టి అభివృద్ధిని విస్మరించారని, కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చూస్తోందని పునరుద్ఘాటించారు. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు పెద్దఎత్తున తరలి వస్తున్నాయని పల్లా శ్రీనివాస్ వివరించారు.
పార్టీ కష్టకాలంలో నిలబడిన వారికి నామినేటెడ్ పదవులు (ఏఎంసీలు, దేవాలయాల కమిటీలు వంటివి) పదవులు కల్పించామని, ఇది కేవలం సిఫార్సుల ఆధారంగా కాకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వారిని గుర్తించి ఇచ్చామన్నారు. పార్టీ సభ్యత్వంలో ఉన్న ఇన్స్యూరెన్స్ ద్వారా ప్రమాదవశాత్తూ మరణించిన 400మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల వంతున ఇప్పటివరకు రూ.20 కోట్లు అందచేసినట్టు వెల్లడిరచారు. దేశంలో ఏ పార్టీ ఇవ్వని ఇన్స్యూరెన్స్ తమ పార్టీ కార్యకర్తలకు అందిస్తున్నామని పల్లా పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ కార్యకర్తలకు అండగా ఉంటామని, 2029 లక్ష్యంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే శుక్ర, శనివారాలలో నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ప్రజలనుంచి వచ్చిన అన్ని ఫిర్యాదులను (గ్రీవెన్స్) పీజీఆర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి పర్యవేక్షిస్తున్నట్టు పల్లా స్పష్టం చేశారు. గత పది నెలల్లో వచ్చిన 6 లక్షల ఫిర్యాదులలో ఎక్కువ భాగం రెవెన్యూ సమస్యలేనని, మంత్రి నారా లోకేష్ గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థను మరింత మెరుగుపర్చడానికి చర్యలు తీసుకొంటున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ ఏడాది రూ.400 కోట్లు విడుదల చేశామని, గత ప్రభుత్వ హయాంలో ఇది రూ.50 కోట్లు కూడా దాటలేదని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి తాము ఎప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.