- ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీదే
- ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి
- విశాఖ వేదికగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ఆర్కే బీచ్‌నుంచి భోగాపురం వరకూ 5 లక్షల మందితో కార్యక్రమం
- రికార్డు సృష్టించేలా నేటినుంచి నెలపాటు యోగాంధ్ర -2025 నిర్వహణ
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లమంది యోగాలో పాల్గొనేలా సంకల్పించామన్న సీఎం
అమరావతి (చైతన్య రథం): ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్పవరం యోగా అని, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారన్నారు. నేటినుంచి నెలరోజుల పాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 21న ఆర్కే బీచ్‌నుంచి భోగాపురం వరకూ 5 లక్షలమందితో కార్యక్రమం జరుగుతుందని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. ఈ సందర్భంగా యోగాంధ్ర వెబ్‌సైట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఘనతే మోదీదే
యోగా అనేది మన దేశానికి వారసత్వంగా వస్తోంది. భారతీయ జీవన విధానంలో ఒక భాగం. దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది ప్రధాని మోదీయే. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దేశంలో చదువుకునేవారు. రానురాను విదేశీ దాడులతో అంతా కనుమరుగైంది. మళ్లీ ఇప్పుడు యోగా విలువ ప్రపంచానికి తెలిసేలా ప్రధాని మోదీ చేశారు. 2014 డిసెంబర్‌లో యునైటెడ్ నేషనన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచంమంతా యోగా దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యోగా అనేది ఒక ప్రాంతానికో, మతానికో సంబంధించినది కాదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో, మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. మనిషి జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది యోగా. నేటి ఆధునిక యుగంలో అందరూ పరుగులు పెడుతున్నారు. టెక్నాలజీతో ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి దానికీ టెన్షన్ పడుతున్నారు. లైఫ్ మెకానికల్‌గా మారుతోంది. వీటన్నంటిని నుంచి ఉపశమనం రావాలంటే యోగా ఒక్కటే మార్గం. ప్రధాని మోదీ దీక్షతో, పట్టుదలతో ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనవంతుగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఏపీ చరిత్రలో నూతన అధ్యయనం
రికార్డు సృష్టించేలా నేటినుంచి నెలరోజుల పాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తాం. ఫోటోల కోసమో, ఈవెంట్ల కోసమో చేసే కార్యక్రమం కాదు. నెల మొత్తం పలు కార్యక్రమాలు నిర్వహించి యోగాపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించాం. విశాఖ ఆర్కే బీచ్‌నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తాం. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లమందికి తగ్గకుండా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 10 లక్షలమందితో యోగా కోర్సులు చేయించి వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయాలని నిర్ణయించాం. సముద్రం పక్కన ఇలాంటి యోగా నిర్వహించడం అరుదైన విషయం. సముద్ర తీరాన, ప్రకృతి ఒడిలో జరిగే ఈ కార్యక్రమం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు.
యోగాపై ప్రజల్లో చైతన్యం తెస్తాం
జూన్ 21న యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్నందున మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం చేస్తుంది. పలు యూనివర్సిటీలు, పబ్లిక్, ప్రైవేటు సంస్థల్లోని వాలంటీర్లు, మహిళలు, వృద్ధులు, పోలీసులు, ఉద్యోగులు యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలి. అలాంటివారికి ధ్రువపత్రాలు అందజేస్తాం. పట్టణాలు, నగరాల నుంచి గ్రామస్థాయి వరకూ యోగాభ్యాసన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మన రాష్ట్రంలో రూ.5 కోట్లకంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలు 21 ఉన్నాయి. అమరావతి బౌద్ద స్థూపం, లేపాక్షి శిల్పారామం, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, అఖండ గోదావరి ఇలా 100 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రాముఖ్యతను వివరించే ఏర్పాట్లు చేశాం. ప్రధాని మోదీ ప్రపంచమంతా యోగాను ప్రమోట్ చేస్తున్నప్పుడు మనకూ బాధ్యత ఉంటుంది కదా. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా కూడా చొరవ తీసుకుని యోగాను ప్రమోట్ చేయాలి. మంచి కంటెంట్‌తో ఆర్టికల్స్ రాయాలి. మంచి వీడియోస్ తయారుచేయాలి. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగాతో అసోసియేట్ చేసుకుని 2 వేలమంది యోగా శిక్షకులను తయారుచేస్తాం. పాఠశాలలో రెండువేల మందిని తయారు చేస్తాం. యోగా ప్రాముఖ్యత తెలిపేలా స్కూల్ సిలబస్‌లో పెడతాం. స్కూళ్లు మొదలవగానే గంటసేపు విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పిస్తాం. యోగా గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వాలంటీర్లకు జూన్ 21న ప్రధాని సభలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యం. మన సమస్యలకు చక్కటి పరిష్కారం యోగా. అందరూ రోజూ ఒకగంట ప్రాణాయామం, ఆసనాలు, మెడిటేషన్ చేయాలి. వీటిని ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి మాయమై పనిని ఎంజాయ్ చేస్తారు. యోగా కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా, పతంజలి, బ్రహ్మ కుమారీస్ ఇలాంటి అసోసియేషపోలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. వీరితో నేను ఎన్నో ఏళ్లుగా అసోసియేట్ అవుతున్నారు. అప్పట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు వాసుదేవ్‌తో ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులకు క్లాసులు పెట్టించాను. బ్రహ్మకుమారీస్ ప్రపంచమంతా యూనిట్లు పెట్టారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మీడియా సమావేశంలో మంత్రి సత్యకుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.