- విధ్వంస రాష్ట్రంలో ఫలితాలు చూపాలంటే వేగం అవసరం
- ఫైళ్ల క్లియరెన్స్‌లో ర్యాంకులు.. పోటీతత్వం పెంచడానికే
- ఒకరు ఎక్కువ.. ఇంకొకరు తక్కువన్న భావనే లేదు..
- నా స్థానాన్ని నేనూ మెరుగుపర్చుకోవాల్సి ఉంది…
- సానుకూల దృక్పథమే ప్రగతి శిఖరాలకు దారి
- ‘ఎక్స్’ వేదికపై సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి (చైతన్య రథం): ‘ప్రజలు చారిత్రక తీర్పుతో గెలిపించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు నుంచే ప్రయత్నిస్తున్నాం. అసమర్థ ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం. టీమ్ వర్క్‌గా పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమనే విషయాన్ని విశ్వసిస్తాను. మంత్రులకు ర్యాంకుల కేటాయింపు ఎవరినీ తక్కువ చేయడానికీ కాదు, ఎక్కువ చేసి చూపెట్టడానికీ కాదు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్ల వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే… మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధివైపు వేగంగా అడుగులేస్తున్నాం. ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని సుపరిపాలన అందిస్తున్నాం. ఇచ్చిన హామీ మేరకు ‘సూపర్ సిక్స్’ పథకాలు అమలు చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తాం.
అయితే లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీమ్‌వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప… విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీమ్‌స్పిరిట్‌తో పనితీరును సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులిచ్చాం. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. తక్కువ చేయడానికీ కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతోపాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ‘పీపుల్స్ ఫస్ట్’ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాము. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామస్థాయిలో చిరుద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి… సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను.