- పుణ్యక్షేత్రాల్లో పాపకార్యాలకు పాల్పడుతున్నారు
- అభివృద్ధి వాదం ఓవైపు… అరాచక వాదం మరోవైపు
- ఐదేళ్లు రాజధాని లేకుండా చేశారు… ఇప్పుడు రాజధాని పదమే లేదంటున్నారు
- వృథా జలాల కోసం రాష్ట్రాల మధ్య గొడవలు వ్యర్థం
- గొడవలకు నై నై… తెలుగు జాతికి జై జై
- పోలవరాన్ని యజ్ఞంలా చేపట్టాం… నదుల అనుసంధానం చేస్తాం
- విద్యుత్ ఛార్జీలు తగ్గించాం… మరింత తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం
- రాయవరం సభలో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
తూర్పుగోదావరి జిల్లా/మండపేట (చైతన్యరథం): ప్రజలకు సంక్ష్షేమం అందిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని… రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో శుక్రవారం కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడిరచారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంటే కొందరు కుట్రలకు ఏ విధంగా పాల్పడుతున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించి చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద నేరస్థుడు ప్రత్యర్ధిగా తయారయ్యాడన్నారు. మంచి జరుగుతుంటే ఆ నేరస్థుడు సహించలేడు.. చెడు జరగాలని కోరుకుంటాడు… చెడు జరిగేలా కుట్రలు పన్నుతున్నాడు. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. కానీ మంచి చేస్తున్న ప్రభుత్వానికి కొందరు అడుగు అడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నాం… ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి ఉచిత బస్సు లాంటి పథకాలు అమలు చేస్తున్నాం. సంక్షేమ పథకాలతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి. త్రిబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ తరహాలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమి పనిచేస్తోంది. గుంతలు లేని రహదారులుగా రోడ్లను తయారు చేస్తున్నామని సీఎం అన్నారు.
ప్రజలపై భారం తగ్గిస్తున్నాం… ఉపాధి పెంచుతున్నాం
గతంలో విద్యుత్ భారం అంతా ప్రజల నెత్తిన ట్రూ ఆప్ ఛార్జీల పేరిట వేశారు. మేం ట్రూ డౌన్ అని కరెంటు బిల్లుల భారం తగ్గించాం. రూ.4500 కోట్లు పెంచుకోమని ఈఆర్సీ అనుమతి ఇస్తే ప్రజలపై భారం వద్దని.. ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోమారు స్పష్టం చేస్తున్నా. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు పేరిట సుపరిపాలన అందించేలా కార్యాచరణ రూపోందించాం. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌరసేవలన్నీ సులభతరం చేశాం. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో గూగుల్ విశాఖకు వస్తోంది. 2027 మార్చిలోగా పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన కాటన్ మహాశయుడ్ని ఇప్పటికీ ఆరాధిస్తున్నాం. మన దేశం కాకపోయినా మనకు మంచి చేసిన వారిని గుర్తుంచుకోవటం మన సంప్రదాయం. పోలవరాన్ని ఒక యజ్ఞంగా భావించి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. గత పాలకులు వరదల్లో ప్రాజెక్టులు ముంచేసి ధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్లతో డయాఫ్రం వాల్ మళ్లీ కట్టాల్సి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేయటమే తన లక్ష్యం అని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.
వివాదాలు వద్దు… తెలుగుజాతి వికాసం కోసం పనిచేద్దాం
ఏటా 3 వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇందులో 200 టీఎంసీలు వాడుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు. సముద్రంలోకి వెళ్లే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు? నీళ్లు వద్దు గొడవలే కావాలని కొందరు బయల్దేరారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల అంటూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు గొడవలు కాదు తెలుగు జాతి ప్రయోజనాలు కావాలి. పోలవరం పూర్తి అయితే నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరికీ చెబుతున్నాను. పట్టిసీమ కట్టి కృష్ణా డెల్టాలో వినియోగించుకుందామంటే వ్యతిరేకించారు. కృష్ణా డెల్టాలో ఇచ్చే నీళ్లను పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించాం. ఈ ఏడాది రాయలసీమలోని రిజర్వాయర్లలో నీళ్లు నింపాం. గతంలో ఆ ప్రాంతంలో వేసిన వేరు శనగ పంట ఎండిపోయిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం రాయలసీమ నీటి కొరత తీర్చి ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దున్నాం. కొందరు నీళ్లు వద్దు వివాదాలే కావాలని నానా యాగీ చేస్తున్నారని సీఎం చంద్రబాబు తప్పుబట్టారు.
కొండపై కుట్రలు చేస్తారా…
తిరుమల కొండపై ప్రసాదాన్ని కల్తీ చేశారు. కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కూటమి వచ్చాక మళ్లీ ఇప్పుడు ఎలాంటి కల్తీ లేకుండా ప్రసాదాన్ని పవిత్రంగా తయారు చేస్తున్నాం. వ్యవస్థలు సక్రమంగా నడుస్తుంటే మళ్లీ కొన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి డిక్లరేషన్ కూడా ఇవ్వని వ్యక్తులు మద్యం బాటిళ్లను తిరుమల కొండపై వేసి అపవాదు వేసే ప్రయత్నం చేస్తున్నారు. బాటిళ్ల ద్వారా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు. సాక్ష్షి పత్రిక ద్వారా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. బాబాయ్ హత్య సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఏమార్చారు. గంజాయితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కోవిడ్ సమయంలో మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారు. ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, కోటి రూపాయల పరిహారం ఇచ్చాం. వాళ్లు చేసిన పాపాలను కడిగేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడమే కూటమి లక్ష్యం. గత పాలకుల వల్ల గాడితప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టాం. గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిచేయడానికే సమయం సరిపోతోంది. కొందరు రాక్షసుల తరహాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు పనులు చేసి వాటిని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు.
సుస్థిర పాలనతోనే సుస్థిరాభివృద్ధి
సుస్థిరమైన పాలన ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఐదేళ్లకు ఓ మారు ఒకర్ని మార్చేద్దామని అనుకుంటే నష్టమే జరుగుతుంది. రెవెన్యూ వివాదాలు పరిష్కరించడానికి రెండేళ్లు పట్టింది. పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు. 2021లోనే పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 2027లో పూర్తి అవుతోంది. అమరావతిది కూడా అదే పరిస్థితి. ఆ ప్రాజెక్టునూ ఇబ్బందులు పెట్టారు. మొన్నటి వరకూ మూడు ముక్కలాట ఆడారు. మూడు రాజధానులని అన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పినా అర్ధం కావటం లేదు. రాజ్యాంగంలో రాజధాని అని ఎక్కడా పేరు లేదని చెబుతున్నారు. బెంగుళూరు ప్యాలెస్ లోనూ, ఇడుపులపాయలోనే కూర్చొంటే అదే రాజధానా… ఈ చాదస్తం ఏమిటి.. ఎవరికీ అర్ధం కావటం లేదు. నదిపక్కన రాజధాని కడుతున్నారని మాట్లాడుతున్నారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, లండన్, చెన్నై, ఢల్లీి, ముంబై లాంటి నగరాలు ఎక్కడున్నాయి. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నారు. పీపీపీ మెడికల్ కాలేజీలపై అందరినీ బెదిరిస్తున్నారు. రహదారులు పీపీపీల ద్వారానే వస్తున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టును మేం పూర్తి చేస్తుంటే అది నాదే అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుంటే.. భరించలేక ఆరోపణలు చేస్తున్నారు. భోగాపురం పీపీపీ అయితే అది ముద్దు… కానీ పీపీపీ కింద మెడికల్ కాలేజీలు కడితే వద్దంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.













