- రాష్ట్రంలో అపార అవకాశాలు
- మీ అభివృద్ధి యాత్రలో భాగం పంచుకోవడం గర్వకారణం
- మంత్రి లోకేష్ పోస్ట్‌కు ఆనంద్ మహీంద్రా స్పందన
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో భాగం పంచుకోవడం గర్వకారణమని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సోలార్ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్, టూరిజం విభాగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై తమ బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో శనివారం పోస్ట్ పెట్టారు. మంత్రి నారా లోకేష్ శుక్రవారం పెట్టిన పోస్టుకు బదులిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రయాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ‘మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మున్ముందు ఏమవుతుందో చూద్దాం’ అంటూ తెలుగులోనే పోస్ట్ పెట్టడం విశేషం.
మహీంద్రా నుంచి ప్యూరియో ట్రక్ తెలుగు అడ్వర్‌టైజ్‌మెంట్‌ను తన ఎక్స్ వేదికగా ఆనంద్ మహీంద్రా శుక్రవారం పోస్ట్ చేశారు. ‘‘ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్‌ను సొంతం చేసుకోండి.. జీవితం మార్చుకోండి’’ అంటూ తెలుగులో ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియోను చూసిన మంత్రి నారా లోకేష్.. మీ ప్రకటన హృదయాన్ని హత్తుకునేలా ఉందంటూ ప్రశంసించారు. మహీంద్రా వాహనాలకు అతిపెద్ద మార్కెట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది కచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు అన్ని అవకాశాలున్న ఏపీలో మహీంద్రా తయారీ కేంద్రాన్ని నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కోరారు. దీనికి ఆనంద్ మహీంద్రా తాజాగా బదులిచ్చారు.