- ఈస్థాయికి రావడానికి పడిన కష్టాన్ని విస్మరించొద్దు
- వైసీపీ ప్రతిపక్షం కాదు.. విషవృక్షం
- ఫేక్ ప్రచారాలే.. ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతం
- వాళ్లే వివాదం సృష్టించి.. ప్రభుత్వంపై రాళ్లేస్తారు
- సమర్థంగా తిప్పికొట్టకుంటే పార్టీకి, రాష్ట్రానికి నష్టం
- ప్రజలకు అర్థమయ్యేలా వాస్తవాలు వివరించాలి
- అందుకు, నేతలు నిత్యం ప్రజల్లోనే ఉండాలి
- అధికారంలో ఉన్నామని మౌనం వహిస్తే ప్రమాదం
- సాధించిన ప్రగతి, సంక్షేమాన్ని ప్రజలకు చెప్పాలి
- సెప్టెంబరు 6న ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ నిర్వహిద్దాం
- పార్లమెంట్ కమిటీల నియామకంలో పారదర్శకం ముఖ్యం
- కమిటీ నియామకంలో సోషల్ రీయింజనీరింగ్
- టీడీపీ జాతీయాధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- పార్లమెంట్ కమిటీల ఏర్పాటుపై మొదలైన కసరత్తు
అమరావతి (చైతన్య రథం): తెదేపా పార్లమెంట్ కమిటీలపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ కమిటీల ఏర్పాటుకు ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులు.. ఇలా మొత్తం 34మంది సభ్యులతో ఒక్కో పార్లమెంట్ కమిటీ ఏర్పాటు కానుంది. కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, మీడియా కార్యదర్శులకూ ఇందులో స్థానం కల్పించారు. అదేవిధంగా 28మందితో పార్లమెంట్‌స్థాయిలో అనుబంధ విభాగాల కమిటీలపైనా అభిప్రాయాల సేకరణ చేయనున్నారు. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి పార్లమెంట్ స్థాయిలో 54 సాధికార సమితిలు ఏర్పాటు కానున్నాయి. పార్లమెంట్ పరిధిలోని పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ తీసుకోనుంది. వీటిపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీల్లోని 75 మంది నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చిన తరవాత అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. గత ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను చక్కదద్ది.. సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. అభివృద్ది ఆగకుండా చూస్తున్నాం. ఎన్నికల ముందు ప్రకటించినట్టే.. సూపర్ సిక్స్‌ను అమల్లోకి తీసుకొచ్చి.. సూపర్ హిట్ చేశాం. మ్యానిఫెస్టోలో ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికే నెరవేర్చాం. పథకాలు సకాలంలో అమలు వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి వర్గానికి ఏదోక లబ్ది చేకూర్చాం. ఏడాది కాలంలో ఇన్ని పనుల చేయడం గొప్ప ముందడుగు భావించాలి. వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. వాళ్లు ఫేక్ ప్రచారాలనే రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుని రోజువారీ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల సమస్యలు, ప్రజల ప్రయోజనాలు వాళ్లకు అనవసరం. వాళ్లకు కావాల్సింది.. రాద్దాంతం.. తప్పుడు ప్రచారం.. మంచిపై చర్చ జరగకుండా చూడడం. నిత్యం తప్పుడు ప్రచారంతో ప్రభుత్వ పథకాలపై, మంచి కార్యక్రమాలపైనా చర్చ జరగకుండా చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది.
ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయాయంటూ అనేక తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు. సింగయ్యను చంపేసి దాన్నీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. లో లెవల్ పొలిటికల్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలు వైసీపీ చేస్తోంది. వాళ్లే వివాదం సృష్టించి… వాళ్లే క్రైంచేసి మళ్లీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అర్హుల పింఛన్ల తొలగించలేదు. కానీ వైసీపీ ప్రచారం మాత్రం లక్షల పింఛన్లు తొలగించినట్టు సాగుతోంది. వైసీపీ ప్రతిపక్షం కాదు, విష వృక్షం. తప్పుడు ప్రచారాలతో నిత్యం వాళ్ల రాజకీయాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితులను మనం సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంది. ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలి. వైసీపీ విధానాలను, కుట్రలను ఉదాహరణలతో చెపితే ప్రజలు అర్థం చేసుకుంటారు. గెలిచాం, అధికారంలో ఉన్నామని తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండటం పార్టీకి, ప్రభుత్వానికీ ప్రమాదం. సంక్షేమ పథకాలపై చర్చ జరగకూడదనేది వైసీపీ ప్రధాన లక్ష్యం. కానీ చేసిన మంచిపై మనం ప్రజలకు నిత్యం వివరిస్తూనే ఉండాలి. సెప్టెంబర్ 6న అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ నిర్వహిద్దాం. ప్రజల్లో ఉన్న సానుకూలతను పెంచుకునేలా పార్టీ నేతలు ప్రజల్లో తిరగాలి. వారితో మమేకమవ్వాలి. పార్టీపై ఫోకస్ పెట్టి బలోపేతం చేసుకోవాలి. తెలుగు దేశం పార్టీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంటుంది. అనేక సవాళ్లను ఎదుర్కొని, అనేక పోరాటాలు చేశాం కనుకే.. ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. పార్టీని రీ ఆర్గనైజ్ చేశాం. రీ స్ట్రక్చర్ చేశాం. యువతకు అవకాశాలు ఇస్తున్నాం. తెలుగుదేశం సిద్దాంతం చాలా బలమైనది.. విశిష్టమైనది. అందుకే ఇన్నేళ్లుగా ప్రజాదరణ పొందుతోంది. సంస్థాగతంగా బలమైన, అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ మన తెలుగు దేశం’ అంటూ చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
‘పార్టీలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉండాలి’ అని సూచించారు. ‘ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు మరింత బాధ్యతగా ఉండాలి. ఎన్నో పోరాటాలు చేసి నేడు మనం ఇక్కడికి వచ్చాం. గత ఐదేళ్లు అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డాం అనేది మర్చిపోవద్దు. పార్టీ ఇమేజ్‌ను, ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచేలా నేతల తీరుండాలి. పార్టీపై ఫోకస్ పెట్టాను. పార్టీలో కింది స్థాయినుంచి పైవరకు బలమైన స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంట్ కమిటీల నియామకం అత్యంత పాదర్శకంగా, పకడ్బందీగా జరగాలి. కమిటీ నియామకంలో సోషల్ రీయింజనీరింగ్ జరగాలి. అన్ని వర్గాలకు, బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలి. మొహమాటాలకు పోయి డమ్మీలు, వీక్‌గా ఉండే వాళ్లను పెడితే ప్రభుత్వం, పార్టీ నష్టపోతాయి. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అలసత్వం తగదు. పార్టీ కమిటీలు బలంగా, యాక్టివ్‌గా ఉండాల’ని చంద్రబాబు నాయుడు సూచించారు.