- మత్స్యకారులకు ఇది పండుగ రోజు
- మత్స్యకార భృతి పంపిణీ సభలో మంత్రి నిమ్మల
నర్సాపురం (చైతన్యరథం): సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రాధాన్య క్రమంలో నెరవేరుస్తూ మాట నిలబెట్టుకొంటోందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అందులో భాగంగానే మత్స్యకారులకు వేట నిషేధకాల భృతిని పదివేల రూపాయల నుంచి రూ.20,000కు పెంచి పంపిణీ చేస్తునన్నట్లు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద మంత్రి నిమ్మల మత్స్యకారులకు వేటనిషేధ భృతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నర్సాపురంలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారులందరికీ ఖాతాల్లో డబ్బు పడటం ఆనందదాయకమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సేవలో పథకానికి 1,29, 178 లబ్ధిదారులను ఎంపిక చేయగా వీరికి ఒక్కొక్కరికి 20,000 చొప్పున రూ.258.356 కోట్లు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించడం అరుదైన విషయంగా ఆయన అభివర్ణించారు.
బీసీల పట్ల, మత్స్యకారుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానానికి ఇది ప్రత్యక్ష తార్కాణమన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పూర్వం సమాజంలోనే సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన రాజకీయాల్లో ఎన్టీఆర్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించి బీసీలను సమాదరించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. టీడీపీ పట్ల ప్రత్యేకించి మత్స్యకార సోదరుల మమకారం ఎప్పటికీ మరువలేమన్నారు. కూటమిలోని మూడు పార్టీల అధినేతలు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్రిమూర్తుల్లా జత కూడటం మన రాష్ట్రానికి గొప్ప అదృష్టంగా భావించాలన్నారు. ఈ పథకం కింద నర్సాపురం ప్రాంత మత్స్యకారులకు ఒనగూరిన లబ్ధిని గణాంకాలతో సహా మంత్రి వివరించారు. మత్స్యకార సదస్సులో స్థానిక ఎమ్మెల్యే నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, లబ్ధిదారులైన మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.