- కలికిరి ఇంజనీరింగ్‌కు యూనివర్సిటీ హోదాపై పరిశీలిస్తాం
- వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు వచ్చాక అధ్యాపక పోస్టుల భర్తీ
- అసెంబ్లీలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గతవైభవం తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సంకల్పం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో టాప్ -100లో ఏపీ వర్సిటీ ఉండాలని నాకు టార్గెట్ ఇచ్చారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో 9వస్థానం నుంచి 3వస్థానానికి తేవాలని చెప్పారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాసనసభలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ… కలికిరిలో సుమారు రూ.650కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల భవనాలు నిర్మించడం జరిగింది. హైవే నెం.75పై పెద్దఎత్తున ఇన్‌ఫ్రాస్ట్చక్చర్ ఉంది. కలికిరి ఇంజనీరింగ్ కాలేజీని యూనివర్సిటీ స్థాయికి పెంచాలి. పూర్వం అన్ని యూనివర్సిటీలు తిరుపతిలో కట్టారు. కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ ఉందని తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ… నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు పెట్టి తమ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. నెల్లూరులో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి, ఆర్ట్స్ కోర్సులను ప్రవేశపెట్టండి. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో 130 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత ఉంది.
యూనివర్సిటీలో తాగునీటి సమస్య పరిష్కరించండి. హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… పీలేరులో పాదయాత్ర చేసినపుడు కిషోర్‌కుమార్‌రెడ్డి అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను చూపించారు. దీనిపై అధికారులతో చర్చించాం. అక్కడ యూనివర్సిటీ హోదా ఇచ్చే అంశాన్ని కిశోర్‌కుమార్‌రెడ్డితో చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని మేం భావిస్తున్నాం. ఎఫిలియేషన్స్ ఎలా చేయాలనే విషయమై పూర్తిస్థాయి చర్చ అవసరం. పాఠశాల విద్యలో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఉన్నత విద్యలో పెద్దఎత్తున సంస్కరణలు తేవాలని భావిస్తున్నాం. యూనిఫైడ్ రూల్స్ తెస్తే ఎలా ఉంటుందనే విషయమై చర్చిస్తున్నాం. రూల్ ఆఫ్ కమిషనరేట్, ఉన్నత విద్యామండలి, కరిక్యులమ్ ప్రక్షాళనపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ… ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయి. వీటిని బలోపేతం చేసి ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా తీసుకురావాలనే అంశంపై దృష్టిసారించాం. మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఆర్ట్స్ కోర్సులు ఎలా అమలు చేయాలనే విషయాన్ని చర్చిస్తాం. ప్రత్యేకించి ఆర్ట్స్ కోర్సుల్లో అడ్మిషన్లు, ప్లేస్‌మెంట్స్ తక్కువగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కాకుండా ఇతర కోర్సుల్లో కూడా ఇండస్ట్రీ కనెక్ట్ చేసి ప్లేస్‌మెంట్ వచ్చేలా కృషిచేస్తాం. ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణకు ప్రతిపక్షంలో ఉన్నపుడు మేం పెద్దఎత్తున పోరాడాం. గత ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థ రద్దు చేయాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థులు, ప్రజాసంఘాలు ధర్నాలు చేపడితే డిగ్రీ కాలేజిలోకి పోలీసులను పంపి లాఠీచార్జి చేయించారు. ఎంతోమంది ప్రముఖులతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఎయిడెడ్ కళాశాలలోనే చదివారు.
వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై నాడు మేం పోరాటంవల్లే మూడు ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు కూడా ఎయిడ్ అడగవద్దని చెప్పారు. ఎయిడెడ్ కాలేజిలకు ఒక ప్రత్యేకమైన పాలసీని తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపాల్సి ఉంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ కలిపి 4330మంది అధ్యాపక పోస్టులకుగాను ప్రస్తుతం 1048 మాత్రమే ఉన్నారు. 3282 ఖాళీలను భర్తీచేయాల్సి ఉంది. ర్యాంకింగ్స్ మెరుగుపడాలంటే ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు వచ్చిన వెంటనే న్యాయపరమైన చిక్కులను తొలగించి ఖాళీలను భర్తీచేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పోస్టులు అమ్మకానికి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని బుచ్చయ్యచౌదరి కోరగా, ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ తర్వాత కొత్త ఎయిడెడ్ పాలసీలో అటువంటివి జరగకుండా చూస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.